ఉక్రెయిన్ శరణార్ధుల వెల్లువతో ఆదుకోమంటున్న మాల్డోవా

ABN , First Publish Date - 2022-03-13T16:43:05+05:30 IST

ఉక్రెయిన్ శరణార్థులు వెల్లువలా తమ దేశంలోకి వచ్చిపడుతుండటంతో తూర్పు యూరోప్ దేశమైన మాల్డోవా ..

ఉక్రెయిన్ శరణార్ధుల వెల్లువతో ఆదుకోమంటున్న మాల్డోవా

కీవ్: ఉక్రెయిన్ శరణార్థులు వెల్లువలా తమ దేశంలోకి వచ్చిపడుతుండటంతో తూర్పు యూరోప్ దేశమైన మాల్డోవా విలవిల్లాడుతోంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని వేడుకుంటోంది. ఇప్పటి వరకూ ఉక్రెయిన్ నుంచి సరిహద్దులు దాటి తమ దేశంలోకి 2,70,000 మంది వచ్చారని మాల్డోవా ప్రధాని నటలియా గార్విలిటా తెలిపారు. కనీసం లక్ష మంది వరకూ తాత్కాలికంగా ఇక్కడే బస చేయాలనుకుంటున్నారనీ, మాల్డోవా వంటి చిన్న దేశానికి ఇది చాలా పెద్ద సంఖ్య అని ఆయన వాపోయారు. శరణార్ధుల సంఖ్య తమ దేశ జనాభాలో నాలుగు శాతమని తెలిపారు. అంతర్జాతీయ సమాజం తమకు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.


ఉక్రెయిన్, రొమేనియా మధ్యన ఉన్న అతి చిన్న దేశమైన మాల్డోవాలో 25 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాల్లో ఇదొకటి. ప్రతిరోజూ వేలాది మంది శరణార్థులు వస్తుండటంతో మాల్డోవా పౌరులు వారికి తాత్కాలిక ఆవాసం వంటి చేయూతను అందిస్తున్నట్టు గార్విలిటా తెలిపారు. యుద్ధం వల్ల ఎలాంటి ఆర్థిక విపత్తులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నదే తమను తీవ్రంగా బాధిస్తోందని, ముఖ్యంగా యూరోప్ దేశాల్లోని పేద దేశాల్లో ఒకటైన తమ దేశంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తప్పనిసరిగా బయట నుంచి సాయం కావాలని ప్రపంచ దేశాలను కోరారు.

Updated Date - 2022-03-13T16:43:05+05:30 IST