Abn logo
Mar 26 2020 @ 01:41AM

వైద్య సిబ్బందిని వేధిస్తే ఖబడ్దార్‌

ఇళ్ల యజమానులు, పొరుగువారి నుంచి

సమస్యలు ఎదురైతే చర్యలు తీసుకోండి

హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయండి: కేంద్రం

వారు దేవుడితో సమానం.. గౌరవించాలి

టార్గెట్‌ చేస్తే భారీ మూల్యం: మోదీ

పేదలకు మరో రెండు కిలోల బియ్యం

హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ఎగుమతిపై నిషేధం


న్యూఢిల్లీ, మార్చి 25: కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్‌ సిబ్బందిని వేధిస్తున్న ఉదంతాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ‘వైట్‌ యూనిఫాం (డాక్టర్లు, నర్సులు) సిబ్బంది ప్రస్తుత పరిస్థితుల్లో దేవుళ్లతో సమానం. వారిని వేధించడం దారుణం. వారు కష్టపడేది మన కోసం. వారిని గౌరవించాలి.. మీరంతా సహకరించాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘డీజీపీలతో మాట్లాడాలని హోంశాఖను కోరాను. ఎవరైనా డాక్టర్లను టార్గెట్‌ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించారు. వైద్యసిబ్బందిని బలవంతంగా వారు అద్దెకుంటున్న ఇళ్ల నుంచి యజమానులు ఖాళీ చేయించినా తీవ్ర పరిణామాలుంటాయని కేంద్రం వార్నింగిచ్చింది.


‘‘ఇళ్ల యజమానులుగానీ, పొరుగువారు, స్థానికులు గానీ ఇబ్బంది పెడితే.. వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఆ సిబ్బంది ఫిర్యాదు చేసేందుకు వీలుగా హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేయాలి, రాష్ట్ర రాజధానితోపాటు జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలి’’ అని కేంద్ర హోంశాఖ రాష్ట్రాల డీజీపీలకు, సీఎ్‌సలకు పంపిన అడ్వయిజరీలో పేర్కొంది.


సామాన్యుడికి సాయం....

 కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన తరుణంలో పేదవర్గాలు ఆహార దినుసుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రేషన్‌ షాపుల ద్వారా సబ్సిడీపై ప్రతి వ్యక్తికీ నెలకు 5 కిలోలు ఇస్తున్న ఆహార పదార్థాలను 7 కిలోలకు పెంచింది.   దీని ప్రకారం కిలో బియ్యాన్ని రూ.3కు,  రూ.27కు కిలో ఉన్న గోధుమలను రూ.2కు పంపిణీ చేయనుంది. ఈ మేరకు  ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) నిర్ణయించినట్లు సమాచార మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ముందుగానే తీసుకోవాలని కోరారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతి వ్యక్తికీ 12 కిలోల బియ్యం ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 


కరోనా కే జవాబ్‌ కరుణా సే....

తన నియోజకవర్గమైన వారాణసీ ప్రజలతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా బుధవారం నాడు ప్రధాని సంభాషించారు. కరోనా విషయంలో జాగ్రత్తల గురించి చెబుతూ ఎవరూ సొంత వైద్యానికి ప్రయత్నించవద్దని, డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలని కోరారు. ‘‘మహాభారత యుద్ధం 18 రోజులే జరిగింది. కానీ మనం చేస్తున్న యుద్ధం 21 రోజులపాటు సాగుతుంది. ఆనాడు కృష్ణ భగవానుడు రథ సారథి. ఈనాడు దేశంలోని 130 కోట్ల మంది భారతీయులూ సారథులే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్యులు, వలస కూలీలు, దినసరి వేతన కార్మికులు కొన్ని ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనంటూ ప్రస్తుత స్థితిలో వైరస్‌ నిర్మూలనే ప్రథమ కర్తవ్యం కావాలన్నారు. ‘వైర్‌సకు పేదా గొప్పా తారతమ్యం ఉండదు. ఎవరినైనా కాటేస్తుంది. అందరూ పేదల పట్ల కరుణ చూపాల్సిన తరుణమిది.. కరోనా కే జవాబ్‌ కరుణా సే’ అని ఆయన పేర్కొన్నారు. ‘చిన్న చిన్న లోపాలుండొచ్చు. నిరాశా నిస్పృహలకు వెయ్యి కారణాలుండొచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ శోధించడం సరికాదు. వైరస్‌ విజయమే పరమావధి’ అన్నారాయన. 

Advertisement
Advertisement
Advertisement