కువైత్‌ ప్రధానికి మోదీ ఫోన్‌

ABN , First Publish Date - 2020-04-03T09:32:51+05:30 IST

కరోనా రక్కసిపై పోరులో తీసుకోవాల్సిన చర్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కువైత్‌ ప్రధాని షేక్‌ ఖాలీద్‌ అల్‌ సభాకు ఫోన్‌ చేసి చర్చించారు. వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు ఇరు దేశాలు తీసుకోవాల్సిన...

కువైత్‌ ప్రధానికి మోదీ ఫోన్‌

(గల్ఫ్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి) : కరోనా రక్కసిపై పోరులో తీసుకోవాల్సిన చర్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కువైత్‌ ప్రధాని షేక్‌ ఖాలీద్‌ అల్‌ సభాకు ఫోన్‌ చేసి చర్చించారు. వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు ఇరు దేశాలు తీసుకోవాల్సిన చర్యలు, పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారని కువైత్‌ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నిర్మూలనతో పాటు ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి. కువైత్‌లో సరైన వీసాల్లేకుండా ఉంటున్న విదేశీయులందరితో పాటు భారతీయులు కూడా స్వచ్ఛందంగా తిరిగి వెళ్లిపోవడానికి కువైత్‌ ప్రభుత్వం ఆమ్నెస్టీ పథకం ప్రకటించిన రోజే కువైత్‌ ప్రధానికి మోదీ ఫోన్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది.   

మక్కా, మదీనాల్లో ఒకరోజు కర్ఫ్యూ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. మక్కా, మదీనా నగరాల్లో ఒకరోజు కర్ఫ్యూ విధిస్తూ గురువారం సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆహార సరఫరా, ఆరోగ్యం తదితర కీలక రంగాల్లో పనిచేసే వారికి మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.

Updated Date - 2020-04-03T09:32:51+05:30 IST