నూతన పార్లమెంటు భవనానికి త్వరలో మోదీ శంకుస్థాపన?

ABN , First Publish Date - 2020-11-25T17:40:52+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో నూతన పార్లమెంటు భవనం నిర్మాణానికి

నూతన పార్లమెంటు భవనానికి త్వరలో మోదీ శంకుస్థాపన?

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో నూతన పార్లమెంటు భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనిని 21 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని ముక్కోణాకారంలో నిర్మిస్తారని తెలుస్తోంది. ఉమ్మడి కేంద్ర సచివాలయం ఉంటుందని సమాచారం. రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్‌ను కూడా ఆధునికీకరిస్తారని చెప్తున్నారు. 


విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం డిసెంబరు 10లోగా నూతన పార్లమెంటు భవనం నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. అయితే మోదీ అందుబాటులో ఉండటాన్నిబట్టి కచ్చితమైన తేదీని నిర్ణయిస్తారు. ఈ నూతన భవనంలో అందరు ఎంపీలకు ప్రత్యేక కార్యాలయాలు ఉంటాయి. కాగితాల రహిత కార్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు తగిన అత్యాధునిక డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లను ఏర్పాటు చేస్తారు. 


భారత దేశపు ప్రజాస్వామిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు అద్భుతమైన రాజ్యాంగ మందిరం కూడా దీనిలో ఉంటుంది. ఎంపీల కోసం విశ్రాంతి మందిరం, గ్రంథాలయం, వివిధ సంఘాల కోసం గదులు, భోజనం తదితర తినుబండారాలను స్వీకరించేందుకు ప్రత్యేక ప్రదేశం, వాహనాల పార్కింగ్ స్థలం ఉంటాయి. 


ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని బ్రిటిష్ పరిపాలన కాలంలో నిర్మించారు. న్యూఢిల్లీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఎడ్విన్ లుట్యేన్స్, హెర్బర్ట్ బేకర్ ఈ భవనానికి ప్లాన్ తయారు చేశారు. దీనికి 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. రూ.83 లక్షలతో ఆరు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయింది. 1927 జనవరి 18న అప్పటి భారత దేశ గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. 


నూతన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రస్తుత భవనాన్ని ఇతర ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. 


Updated Date - 2020-11-25T17:40:52+05:30 IST