భారతీయ భాషల్లో ఆధునిక చదువులు

ABN , First Publish Date - 2021-03-05T08:00:29+05:30 IST

ఆధునిక వైద్య విద్య, శాస్త్ర సాంకేతిక విద్య, న్యాయ విద్య, పరిశోధనలు వంటివన్నీ భారతీయ భాషల్లో జరిగే రోజులు రావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. గురువారం తిరుపతి ఐఐటీ 6వ వార్షికోత్సవంలో

భారతీయ భాషల్లో ఆధునిక చదువులు

దేశంలో అలాంటి రోజులు రావాలి.. పాఠశాల విద్య మాతృభాషలోనే సాగాలి

తిరుపతి ఐఐటీ వార్షికోత్సవంలో వెంకయ్య 


తిరుపతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఆధునిక వైద్య విద్య, శాస్త్ర సాంకేతిక విద్య, న్యాయ విద్య, పరిశోధనలు వంటివన్నీ భారతీయ భాషల్లో జరిగే రోజులు రావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. గురువారం తిరుపతి ఐఐటీ 6వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సకల శాస్త్ర, సాంకేతిక చదువులు ప్రాంతీయ భాషల్లో సాగే రోజులు తప్పక వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాల స్థాయి వరకూ విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని, పరిపాలన సమస్తం ప్రజల భాషలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో వాద ప్రతివాదనలు, తీర్పులు మాతృభాషలోనే సాగాల్సి ఉందన్నారు. మాతృభాష తర్వాతే ఇతర భాషలు నేర్చుకోవాలని విద్యార్ధులకు ఉపరాష్ట్రపతి సూచించారు. 


అమర ఆస్పత్రి సేవలు భేష్‌ 

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి వద్ద అమరరాజా గ్రూపు సంస్థలు నిర్మించిన అమర ఆస్పత్రిని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఆస్పత్రిని అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రసాద్‌ గౌరినేని, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమాదేవిలను ప్రశంసించారు. 


తిరుమలలో వెంకయ్య దంపతులు

గురువారం ఉదయం చెన్నై నుంచి వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏర్పేడు సమీపంలోని ఐఐటీ ప్రాంగణానికి చేరుకుని వార్షికోత్సవంలో పాల్గొన్నారు.  సాయంత్రం బయల్దేరి తిరుమల చేరుకున్నారు. గురువారం రాత్రికి తిరుమలలో బస చేసి శుక్రవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుంటారు. 

Updated Date - 2021-03-05T08:00:29+05:30 IST