ఆరంభం.. అదిరింది

ABN , First Publish Date - 2022-06-16T04:55:57+05:30 IST

ఆరంభం.. అదిరింది

ఆరంభం.. అదిరింది
ఆమనగల్లు : పొంగిపొర్లుతున్న మేడిగడ్డ కత్వ వాగు, మధురాపురంలో కొట్టుకుపోయిన వ్యవసాయ దారి

  • తొలకరి శుభారంభం
  • పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • అనేకచోట్ల ఒకే రోజులో నిండిన చెరువులు, కుంటలు
  • రైతన్నల్లో సంతోషం
  • కేశంపేటలో అత్యధికంగా 159.3 మి.మీ వర్షపాతం నమోదు
  • కుంభవృష్టితో పలు చోట్ల నీటమునిగిన ప్రాంతాలు
  • కూరగాయ పంటలకు నష్టం


రుతుపవనాలు విస్తరించడంతో రంగారెడ్డిజిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి  పలు చోట్ల భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకే ఒక్క వర్షానికి చెరువులు, కుంటలు నిండి ప్రవహించడం విశేషం. కుండపోత వర్షాలకు కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.  కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మునిగాయి. అనేకచోట్ల పంట పొలాలు వర్షపు నీటితో నిండిపోయాయి. కూరగాయ, ఆకుకూర పంటలు అనేక చోట్ల దెబ్బతిన్నాయి. 


ఆమనగల్లు/చేవెళ్ల/మొయినాబాద్‌రూరల్‌/షాబాద్‌/ షాద్‌నగర్‌అర్బన్‌/కేశంపేట/ ఇబ్రహీంపట్నం/శంషాబాద్‌/కందుకూరు/ యాచారం, జూన్‌ 15: ఆమనగల్లుతోపాటు మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది. మేడిగడ్డ - శంకర్‌కొండ మధ్య వాగు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలెపల్లిలోని చెరువు కుంటల్లోకి వరదనీరు చేరింది. ఆమనగల్లులోని విద్యానగర్‌కాలనీ వరదనీటిలో చిక్కుకుంది. సందబావి వద్ద రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కాగా, వర్షం కురవడంతో రైతులు పంటల సాగుకు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు.


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల డివిజన్‌ చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లో వర్షం కురిసింది. వాన కురవడంతో రైతులు పంటలు వేసేందుకు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎరువులు, విత్తనాలు కొనుగోలులో బిజీగా మారారు. తొలకరి పలకరింపుతో వ్యవసాయ క్షేత్రాల్లో ఆరుద్ర పురుగులు సందడి చేశాయి. షాబాద్‌ మండలం మద్దూర్‌ గ్రామ సమీపంలోని నవీద్‌ ఒలానీ కోళ్ల ఫారంలో గాలివాన బీభత్సానికి సుమారు 200 కోడిపిల్లలు మృతిచెందాయి.


ఫరూఖ్‌నగర్‌ మండలంలో..

ఫరూఖ్‌నగర్‌ మండలం మధురాపురం గ్రామ పరిసరాలలో కురిసిన కుండపోత వర్షానికి చెరువులు, కుంటలు నిండి అలుగులు పారాయి. మధురాపురం, బూర్గుల, గంట్లవెల్లి, శేరిగూడ, కాశీరెడ్బిగూడ తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి ప్రవహించాయి. శేరిగూడలో తాళ్ళచెరువు, బూర్గులలోని మామిడికుంట సైతం ఒకే వర్షానికి నిండటం ఇదే మొదటి సారి అని గ్రామస్థులు చెబుతున్నారు. వ్యవసాయ పొలాలు చెరువులను తలపించాయి. వరద ప్రవాహానికి వ్యవసాయ బాటలు కొట్టుకుపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. 


కేశంపేట మండలంలో..

కేశంపేట మండంలోని సంగెం, పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, ఎక్లా్‌సఖాన్‌పేట, అల్వాల, కొత్తపేట, కొనాయపల్లి, సంతాపూర్‌ గ్రామాలలో భారీ వర్షం కురిసింది. ఎక్లా్‌సఖాన్‌పేట గ్రామంలో గొల్లవాని కుంట అలుగుపారింది. అల్వాల బొమ్మసముద్రం, ఇప్పలపల్లి ఊరచెరువులోకి వరదనీరు చేరింది. 


ఇబ్రహీంపట్నంలో...

ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం కురిసింది. దండుమైలారం సెక్టార్‌లో మోస్తరు వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం టౌన్‌లోని పలు కాలనీల రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. 12వవార్డులో మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. శంషాబాద్‌లో జోరుగా వర్షం కురిసింది. లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.


కందుకూరు మండలంలో..

కందుకూరు మండలంలో జోరువాన కురిసింది. పదేళ్ల తర్వాత పెద్ద వర్షం కురవడం స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాసర్లపల్లి, దెబ్బడగూడ, నేదునూరు, బాచుపల్లి, తదితర గ్రామాల్లోని కుంటలు నిండాయి. అదేవిధంగా కొత్తగూడ సున్నం చెరువులోకి భారీగా వరద నీరు చేరుకుంది. వర్షానికి మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి, సామ సంతోషమ్మ ఫంక్షన్‌హాల్‌ వద్ద వర్షం నీరు ప్రవహించకుండా అడ్డుగా గోడలు నిర్మించడంతో మూడు కార్లు, జేసీబీ యంత్రం నీటిలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలలో సాగు చేసిన ఆకుకూరల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొత్తగూడ గేటు వద్ద రోడ్డుకిరువైపులా డ్రైనేజిని నిర్మించకుండా వదిలేయడంతో గ్రామ మాజీ సర్పంచ్‌ బొక్క మాధవరెడ్డి ఇంటి ప్రహరీ కూలింది. దీంతో కందుకూరు గ్రామానికి చెందిన ఎగ్గిడి చంద్రయ్యకు చెందిన ఆరుమేకలు, గొర్రె అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. కొత్తగూడ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలోకి భారీగా వర్షం నీరు చేరింది. యాచారం మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. 


చేవెళ్ల, ఉప్పల్‌లో రాత్రి భారీ వర్షం

ఇదిలాఉంటే రుతుపవనాలు విస్తరించడంతో బుధ వారం రాత్రి కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బుధవారం రాత్రి చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. కడపటి వార్తలు అందేసరికి చేవెళ్ల మండలం ధర్మసాగర్‌లో 84.8మి.మీ, ఉప్పల్‌లో 78.3 మి.మీ, షాబాద్‌లో 50మి.మీ వర్షం కురిసింది.


జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో..)

కేశంపేట (సంగం) 159.3 

కందుకూరు మండలం 131.3 

ఆమనగల్‌ 126.8 

కందుకూరు (మీర్‌ఖాన్‌పేట) 116 

కొత్తూరు 70

యాచారం 67 

కడ్తాల్‌ 65

చేవెళ్ల 63.3

ఇబ్రహీంపట్నం 63.3

తలకొండపల్లి 54.3

మహేశ్వరం 45 

రాజేంద్రనగర్‌ 42



Updated Date - 2022-06-16T04:55:57+05:30 IST