100 పడకలతో మోడల్‌ ఆస్పత్రి

ABN , First Publish Date - 2021-10-19T04:54:15+05:30 IST

కరోనా మూడో దశ చిన్న పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంతో రాష్ట్రంలోనే రోల్‌ మోడల్‌గా చిన్న పిల్లల ఆస్పత్రిని నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు.

100 పడకలతో మోడల్‌  ఆస్పత్రి
కంటైనర్లతో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల ఆస్పత్రి ఇదే..

చిన్న పిల్లల కోసం నారాయణపేటలో ఏర్పాటు

కరోనా మూడో దశ ఊహాగానాల నేపథ్యంలో..

వెల్స్‌ ఫార్గో, మోడలస్‌, యునిటైడ్‌ వే సహకారం 

రూ.3 కోట్లతో ముస్తాబు

చెన్నై నుంచి తెప్పించిన కంటైనర్లతో సిద్ధం

మునిసిపాలిటీ సహకారంతో గ్రౌండ్‌ బెడ్‌, ప్రహరీ నిర్మాణం


నారాయణపేట, అక్టోబరు 18: కరోనా మూడో దశ చిన్న పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంతో రాష్ట్రంలోనే రోల్‌ మోడల్‌గా చిన్న పిల్లల ఆస్పత్రిని నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. మొబైల్‌ కంటైనర్లతో రూ.3 కోట్ల వ్యయంతో జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్‌ చౌరస్తాలో దీనిని నిర్మించారు. స్పాన్సర్స్‌ వెల్స్‌ ఫార్గో, ఇంప్లిమెంటెడ్‌ బై ఎంమోడలస్‌, సీఎస్‌ఆర్‌ పాట్నర్‌గా యునిటైడ్‌ వే బెంగుళూర్‌ ఉమ్మడి సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ హరిచందన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ స్థలాన్ని మునిసిపాలిటీ నుంచి ఆస్పత్రి ఏర్పాటుకు ఇప్పించారు. గ్రౌండ్‌ బెడ్‌, ప్రహరీ తదితర పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. చెన్నై నుంచి మొబైల్‌ కంటైనర్‌(క్యాబిన్‌)లతో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాబిన్‌లో 13 బెడ్లు ఉన్నాయి. వంద పడకల్లో 30 ఐసీయూ బెడ్లు, మిగతా 70 బెడ్లు ఇతర వైద్య సేవల కోసం ఏర్పాటు చేశారు. కంటైనర్లతో ఏర్పాటు చేసిన మాడల్‌ ఆస్పత్రి అందరినీ ఆకట్టుకుంటోంది.


సిబ్బంది నియామకం

ఆస్పత్రి కోసం జిల్లా ఆస్పత్రి సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఔట్‌ సోర్సింగ్‌ కింద 20 మందిని నియమించారు. అందులో స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, రేడియాలజిస్ట్‌, ఎంఎన్‌ వో, సెక్యూరిటీ  గార్డులు తదితర పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుత మున్న జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు చిన్నపిల్లల స్పెషలిస్ట్‌ డాక్టర్లు వాలీయా, క్రాంతి కుమార్‌ విధులు నిర్వహిస్తుండగా, వారిని కొత్తగా ఏర్పాటు చేసిన చిన్న పిల్లల ఆస్పత్రికి కేటాయించనున్నారు. అవసరం మేరకు ప్రభుత్వం వైద్యులను నియ మించి, వైద్య సేవలను అందుబాటు లోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-10-19T04:54:15+05:30 IST