అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన సెక్యూరిటీ గార్డుకు దిమ్మతిరిగేలాంటి అనుభవం ఎదురయ్యింది. అశ్లీల చేష్టలకు పాల్పడిన సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ను చుట్టుముట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు, మహిళలు అతని దుస్తులు చించుతూ, పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతను మూర్ఛపోయాడు.
వివరాల్లోకి వెళితే 50 ఏళ్ల అరుణ్ గాడ్వీ... అమరావతి రిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నాడు. విధులలో భాగంగా అతనికి మహిళా కార్మికుల డ్రెస్ కొలతలు తీసుకువాల్సిన పని పడింది. ఈ నేపధ్యంలో అరుణ్ గాడ్వీ మహిళలతో అశ్లీల చేష్టలకు దిగి, తనకు సహకరించకపోతే ఉద్యోగం ఊడిపోయేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మహిళా కార్మికులు.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేతలకు తెలియజేశారు. దీంతో వారు అరుణ్ గాడ్వేను పట్టుకుని చితకబాదారు. తరువాత పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.