పోరు రసవత్తరం

ABN , First Publish Date - 2021-11-23T06:20:52+05:30 IST

పోరు రసవత్తరం

పోరు రసవత్తరం
నామినేషన్‌ దాఖలు చేస్తున్న తాతా మధుసూదన్‌, పక్కన మంత్రి పువ్వాడ అజయ్‌

మండలికి రెండు నామినేషన్లు దాఖలు

టీఆర్‌ఎస్‌ తరపున తాతా మధు, స్వతంత్ర అభ్యర్థిగా కొండపల్లి 

నేటితో నామినేషన్ల స్వీకరణ పూర్తి

కాంగ్రెస్‌ తరపున బరిలోకి రాయల 

ఖమ్మం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారుతోంది. ఖమ్మం స్థానానికి సోమవారం ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం దాఖలుకు గడువు పూర్తికానుండటం, కార్తీక సోమవారం మంచి రోజు కావడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆపార్టీ రాష్ట్రకార్యదర్శి తాతా మధుసూదన్‌ (తాతా మధు),  స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌ తరపున కొండపల్లి శ్రీనివాస్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో బరిలో నిలవా లని నిర్ణయించుకున్న కాంగ్రెస్‌.. అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావును ఖరారు చేసింది. ఆయన మంగళ వారం నామినేషన్‌ వేయనున్నారు. దీంతో ఎన్నిక అనివార్యమేనని తెలుస్తోంది. కానీ నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు అవకాశం ఉండటంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటా యోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన తాతా మధు

స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరు ఖరారవడంతో తాతా మధుసూదన్‌ సోమవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:30గంటలకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఇల్లెందు, వైరా, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, లావుడ్యా రాములునాయక్‌, మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి జడ్పీచైర్మన్లు లింగాల కమల్‌రాజ్‌, కోరం కనకయ్య, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌తో పాటు పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన ఎన్నికల అధికారి, ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌కు తన నామినేషన్‌ పత్రాలు అందించారు. కార్తీక సోమవారం మంచిరోజు కావడంతో ము హూర్తబలం చూసుకుని మధు నామినేషన్‌ వేశారు. మంగళ వారం పార్టీపరంగా జిల్లాలోని శానసభ్యులు, పార్టీ నాయకు లు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధుసూదన్‌ బయోడేటా

జననం : జూన్‌ 12, 1965

స్వస్థలం : తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం

తల్లిదండ్రులు : కమలమ్మ, వెంకటకృష్ణయ్య

భార్య : భవాని, పిల్లలు:భార్గవ్‌, కృష్ణస్వరూప్‌

వృత్తి : వ్యాపారం, వ్యవసాయం

విద్యార్హతలు : పిండిప్రోలు జిల్లాపరిషత్‌ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఖమ్మంలో ఇంటర్‌ ఖమ్మం, ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, లా పూర్తిచేశారు. 

రాజకీయ నేపథ్యం : వామపక్ష కుటుంబం నుంచి వచ్చిన మధు విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేశారు. 1986నుంచి 96వరకు సీపీఎం లో పనిచేశారు. 1998నుంచి 2014వరకు అమెరికాలో అట్లాంటా తెలుగు సంఘం (తామా) అధ్యక్షుడిగా, ఉత్తర అమెరికాతెలుగు సంఘం(తానా) కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమానికి మద్దతుగా ఆయన అమెరికాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 2017నుంచి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తునన్న ఆయన లోక్‌సభ, అసెంబ్లీతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. 

కలిసొచ్చిన పల్లాతో స్నేహం

వ్యూహాత్మకంగా టికెట్‌ దక్కించుకున్న మధుసూదన్‌

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీ పడినా.. వ్యూహాత్మకంగా వ్యవహరించి టికెట్‌దక్కించుకున్నారు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్‌. సీనియర్లను కాదని, కేసీఆర్‌ తాతా మధుకు టికెట్‌ ఖరారుచేశారు. విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారం చేసిన మధు.. రాష్ట్ర ఆవిర్భావంతో స్వస్థలానికి వచ్చి టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. అలాగే రైతుబంధు సమ్వయసమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డితో ఉన్నస్నేహబంధం కూడా మధుకు కలిసి వచ్చింది. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి ఆశీస్సులతోనే రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కించుకున్న ఆయన ఆతర్వాత జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికలకు పార్టీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వర్తించి జిల్లానేతలు, శ్రేణులతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ద్వారా సీఎం కేసీఆర్‌ వద్ద గుర్తింపు పొంది.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రేసులో నిలిచారు. ఈ క్రమంలో ఆయనకు ఏడాది క్రితమే ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం కేటాయించేందుకు నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌ పదవిని ముందుగానే బీసీవర్గానికి చెందిన కూరాకుల నాగభూషణానికి చేటాయించారని, ఇక కమ్మ సామాజికవర్గానికి శాసనమండలిలో ఒకసీటు ఇవ్వాలని కేసీఆర్‌ తీసుకున్నారని, అందులో భాగంగా మధుకు లైన్‌క్లియర్‌ అయ్యిందన్న చర్చ జరుగుతోంది. విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐ, ఆతర్వాత సీపీఎంలో చురుకుగాపనిచేశారు. అమెరికా వెళ్లిన తర్వాత ఉద్యోగం, వ్యాపారాలు నిర్వహిస్తూనే తానా, తామా సంఘాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలోనూ కొంతకాలం పనిచేశారు. తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పలు ఎన్నికలకు పార్టీ తరుపున ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. అధినాయకత్వం చెప్పిన పనిని తూచ తప్పకుండా పాటిస్తూ కేసీఆర్‌ దగ్గర పరపతి సాధించారు. దాంతో పాటు పల్లాతో ఉన్న స్నేహంతో వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీపై గురిపెట్టి పావులు కదిపిన మధు చివరకు అధికార పార్టీ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. అయితే తమ పార్టీలో గ్రూపులులేవని, అంతా ఒక్కటిగా ఉన్నామని చెబుతున్నా, ఇప్పటికే మంత్రి పువ్వాడ, మాజీమంత్రి తుమ్మల, ఎంపీ నామ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలుగా శ్రేణులు విడిపోయాయన్నది బహిరంగ సత్యమే. ఈ విభేదాల వ్యవహారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. 

స్వతంత్ర అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్‌ 

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ పంచాయతీ రాజ్‌ చాంబర్‌ తరపున స్వతంత్ర అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాసరావు నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం తన సతీమణితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి వీపీగౌతమ్‌కు పత్రాలు అందించారు. ప్రస్తుతం కల్లూరు మండలం పేరువంచ ఎంపీటీసీగా పనిచేస్తున్న ఆయన తెలం గాణ ఎంపీటీసీల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరి స్తున్నారు. అయితే స్థానిక సంస్థల ప్రతినిధులకు విధులు, నిధులు కలిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానిక సంస్థల ప్రతినిధుల ఆత్మగౌరవం కాపాడేందుకు తాను స్వతంత్ర అభ్యర్థి గా బరిలో దిగుతున్నట్టు కొండపల్లి శ్రీనివాస్‌ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధిగా లేకపోయినా పోటీచేసే అవకాశం కలిపించడం, తమ హక్కులకు విఘాతమేన నన్నారు. తమ సమస్యలపై 18 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి గతంలో ఎంపీటీసీల సంఘం తరుపున స్థానిక సంస్థల ప్రతినిధుల ఛాంబర్‌ తరుపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏ ఒక్కటి పరిష్కరించలేద న్నారు. పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో 12చోట్ల పోటీచేస్తున్నామని, గెలు పోటములు ముఖ్యంకాదని, తమకు ఆత్మగౌరవమే ముఖ్యమన్నారు. 

కొండపల్లి శ్రీనివాసరావు బయోడేటా

తల్లిదండ్రులు : ఇందిర, జోగారావు

విద్యార్హత : ఇంటర్‌, స్వస్థలం : పేరువంచ, కల్లూరు మండలం,

నేపథ్యం: వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు తండ్రి 14ఏళ్లపాటు పేరువంచ సర్పంచ్‌ గా, తల్లి ఇందిర కల్లూరు ఎంపీపీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో శ్రీనివాస్‌ పేరువంచ స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుతం పంచాయతీరాజ్‌ ఆధ్వ ర్యంలో నడుస్తున్న ఎంపీటీసీల సంఘం ఖమ్మం జిల్లా అధ్య క్షుడిగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాయల.. నేడు నామినేషన్‌

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా రాయల నాగేశ్వర రావును ప్రకటించింది. ఈ మేరకు మంగళ వారం ఆయన నామినేషన్‌ దాఖలు చేయ నున్నారు. సోమవారమే నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆయన కలెక్టరేట్‌కు రాగా.. అప్పటికే 5నిమిషాలు ఆలస్యం కావడంతో కలెక్టర్‌ నామినేషన్‌కు అనుమతిం చలేదు. దీంతో మంగళవారం నామినేషన్‌ వేస్తున్నట్టు రాయల ప్రకటించారు. కలెక్టరేట్‌కు రాయలతోపాటు తిరుమలాయపాలెం జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్‌, పలువరు స్థానిక సంస్థలు ప్రతినిధులు వచ్చారు.



Updated Date - 2021-11-23T06:20:52+05:30 IST