ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

ABN , First Publish Date - 2022-09-26T06:38:28+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి వచ్చే ఫిబ్రవరి/మార్చిలో పోలింగ్‌?

వైసీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారు

రెండు రోజుల్లో అభ్యర్థిని ఎంపిక చేయనున్న టీడీపీ

బీజేపీ నుంచి ఎమ్మెల్సీ మాధవ్‌కి మళ్లీ అవకాశం

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఓటర్ల నమోదు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలే కీలకభూమిక పోషిస్తున్నాయి. పేరుకే పట్టభద్రుల ఎన్నికలైనప్పటికీ అంగబలం, అర్థబలమే కీలకం కానున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పరిచయాలు, పట్టభద్రులతో ఓటరు నమోదు ప్రక్రియ, ఓటర్లను కలిసి ప్రచారం చేయడం వంటి కార్యక్రమాల నిర్వహణ కోసం అభ్యర్థులకు ఆర్థికబలం తప్పనిసరి. అందువల్ల పార్టీల మద్దతుతోనే బరిలో నిలుస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో జరగనున్న ఎన్నికలకు వచ్చే నెల ఒకటోతేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మిగిలిన ఎన్నికలకు భిన్నంగా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతి ఆరేళ్లకు ఒకసారి ఓటర్లు తమ ఓటును నమోదుచేసుకోవాలి. ఈ ఎన్నికల్లో ప్రచారం కంటే ఓటర్ల నమోదే అత్యంత కీలంగా మారనున్నది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో సుమారు ఐదున్నర లక్షలమంది పట్టభద్రులు ఉండగా వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొంటున్నారని గత గణాంకాలు చెబుతున్నాయి. 


పార్టీల్లో ఉత్సాహం 

ఎన్నికల కోసం అధికార వైసీపీ సీతంరాజు సుధాకర్‌ పేరును ఇప్పటికే ఖరారుచేసింది. సీపీఎం మద్దతుతో ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) అభ్యర్థిగా డాక్టర్‌ కె.రమాప్రభ పేరును తాజాగా ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం వుంది. పలువురు నాయకులు అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. మూడు జిల్లాలపై పట్టు వున్న, ఓటర్లను ప్రభావితం చేసే అభ్యర్థిని బరిలో దింపాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారు.  కాగా బీజేపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పీఎన్‌వీ మాధవ్‌ మరోసారి బరిలో దిగనున్నారు. పార్టీ అధిష్ఠానం అధికారికంగా ఆయన పేరును ఖరారుచేయాల్సి ఉంది. 


వచ్చేనెల ఒకటి నుంచి ఓటర్ల నమోదు

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వచ్చే నెల ఒకటోతేదీ నుంచి ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబరు ఏడో తేదీ వరకు గడువు వుంది. నవంబరు 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. దానిపై డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, డిసెంబరు 30న తుది జాబితా విడుదల చేస్తారు. ప్రతి మండలంలో ఓటర్ల నమోదు దరఖాస్తులు స్వీకరిస్తారు. విశాఖ కలెక్టర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.  


పీడీఎఫ్‌ అభ్యర్థిగా డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ

పలు సంఘాల ఐక్య వేదిక సమావేశంలో ప్రకటన


విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):


ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పీడీఎఫ్‌ అభ్యర్థిగా డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, ప్రజాసంఘాల ఐక్య వేదిక సమావేశం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. ఐక్యవేదిక కన్వీనర్‌ ఎ.అజశర్మ అధ్యక్షతన 25 సంఘాలు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల వాణిగా, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల తరఫున గళం విప్పేందుకు వీలుగా రమాప్రభ ఎన్నికయ్యేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు, ఏఐటీయూసీ నాయకులు పడాల రమణ, పైడి రాజు, ఎస్‌టీఎఫ్‌ నాయకులు పైడిరాజు, అభ్యర్థి రమాప్రభ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-26T06:38:28+05:30 IST