సంకల్ప యాత్ర కాదు.. ప్రజా వంచన యాత్ర

ABN , First Publish Date - 2020-11-29T06:18:11+05:30 IST

సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్రేనని ఎమ్మెల్సీ, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు.

సంకల్ప యాత్ర కాదు.. ప్రజా వంచన యాత్ర
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జగదీశ్‌

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు



అనకాపల్లి, నవంబరు 28: సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్రేనని ఎమ్మెల్సీ, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, అవ్వాతాతలకు ప్రతీ నెలా రూ.3 వేలు పెన్షన్‌ ఇచ్చారా.? 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న హామీ సాధించారా? ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 45 సంవత్సరాలు ఉన్న మహిళలకు పింఛన్‌ రూ.3 వేలు ఇస్తామన్న హామీ నెరవేర్చారా.? సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామన్న ప్రకటన ఆచరణలో తీసుకొచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేస్తామని చెప్పి 90 శాతం రేట్లు పెంచి పేదల రక్తాన్ని కాసులుగా పిండుకుంటున్నందుకు పాదయాత్ర చేస్తున్నారా? అని నిలదీశారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, పాదయాత్రలో చేసిన వాగ్దానాలు అమలు చేసినట్టు అబద్దాల ప్రకటనలో ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారని బుద్ద విమర్శించారు. పేదలకు ఇచ్చే స్థలం చారెడు.. ఆ  పేరుతో దోచింది బారెడని, సెంటు స్థలం పథకం బడాబాబులకు దోపిడీ పథకంగా మారిందని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కొణతాల వెంకటరావు, బోడి వెంకటరావు, ధనాల విష్ణు చౌదరి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T06:18:11+05:30 IST