ఆర్మీ చేతికి కొత్త అర్జున్‌

ABN , First Publish Date - 2021-02-15T08:15:22+05:30 IST

భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దేశీయంగా అభివృద్ధి చేసిన సరికొత్త ‘అర్జున్‌ మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్‌ (ఎంకే-1ఏ)’ సైన్యం అమ్ములపొదిలోకి చేరింది.

ఆర్మీ చేతికి కొత్త అర్జున్‌

డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంకే-1ఏ ట్యాంకును సైన్యానికి అప్పగించిన ప్రధాని


చెన్నై, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దేశీయంగా అభివృద్ధి చేసిన సరికొత్త ‘అర్జున్‌ మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్‌ (ఎంకే-1ఏ)’ సైన్యం అమ్ములపొదిలోకి చేరింది.  చెన్నై నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఏర్పాటైన సభలో ఆ ట్యాంకు నమూనాను భారత సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఎంఎం నరవణేకు ప్రధాని మోదీ అప్పగించారు. తమిళనాట ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో రూ.కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.


ఆ ప్రాజెక్టులన్నీ నవకల్పనకు, అభివృద్ధికి చిహ్నాలని పేర్కొన్నారు. ‘‘మన సరిహద్దులను కాపాడే మరొక యోధుణ్ని (అర్జున్‌ ట్యాంక్‌) దేశానికి అంకితం చేస్తున్నందుకు గర్విస్తున్నాను. దేశీయంగా రూపకల్పన చేసి, ఇక్కడే తయారుచేసిన అర్జున్‌ ఎంకే-1ఏను సైన్యానికి అందజేస్తున్నందుకు గర్విస్తున్నాను. దక్షిణాదిన తమిళనాడులో తయారైన సాయుధ యుద్ధ ట్యాంకులు ఉత్తరాదిన సరిహద్దులను కాపాడనున్నాయి. భారతదేశ సమైక్య స్ఫూర్తికిది ఉదాహరణ’’ అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  పుల్వామా దాడులు జరిగి రెండేళ్లు పూర్తయ్యిందని, ఆ సందర్భంగా సైనికుల త్యాగాన్ని దేశ ప్రజలెవరూ మరచిపోలేరని గుర్తు చేశారు. ఈ సందర్భంగా.. ‘‘ఆయుధాలు తయారు చేద్దాం, కాగితాలను తయారు చేద్దాం, పరిశ్రమలను స్థాపిద్దాం, పాఠశాలలను నెలకొల్పుదాం, నడిచే, ఎగిరే వాహనాలను తయారుచేద్దాం, ప్రపంచాన్నే గడగడలాడించే నౌకలను నిర్మిద్దాం’’ అంటూ తమిళ కవి భారతియార్‌ రచించిన కవితను ఉటంకించారు. భారతియార్‌ ఆ కవితలో చూపిన దీర్ఘదృష్టిని స్ఫూర్తిగా తీసుకునే భారత దేశం ఆయుధాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిందన్నారు. ఉన్నతాధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. తమిళనాడులోని అవడిలో ఉన్న ‘హెవీ వెహికల్‌ ఫ్యాక్టరీ (హెచ్‌వీఎ్‌ఫ)’కు 118 అర్జున్‌ ట్యాంకుల తయారీకి ఆర్డర్‌ లభించింది.


ఈ ఆర్డర్‌ విలువ రూ.8500 కోట్లు. అర్జున్‌ ఎంకే 1 ఆల్ఫా ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ట్యాంకు అని వారు వివరించారు. 1972లో డీఆర్‌డీవో ఈ అర్జున్‌ మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంకుల ప్రాజెక్టును చేపట్టింది. 2004లో తొలి విడతగా 16 అర్జున్‌ ట్యాంకులు ఆర్మీకి అందాయి. 2011 నాటికి 100 ట్యాంకులు సైన్యం అమ్ములపొదిలో చేరాయి. వాటిని మరింత ఆధునికీకరించి.. 71 కొత్త ఫీచర్లతో ఈ ట్యాంకులను అభివృద్ధి చేశారు. ఈ ఆర్డర్‌ ద్వారా మన దేశానికి చెందిన 200 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన 8000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ట్యాంకుల తయారీలో మొత్తం 15 విద్యా సంస్థలు, 8 ప్రయోగశాలలు, పెద్ద సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పాలుపంచుకుంటున్నాయి.


జెండా ఊపి..

తమిళనాడులో మోదీ ఆదివారం ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ప్రధానమైనది.. రూ.3770 కోట్ల విలువైన చెన్నై మెట్రో రైల్‌ ఫేజ్‌-1 విస్తరణ ప్రాజెక్టు. దీంట్లో భాగంగా చెన్నైలోని వాషర్‌మ్యాన్‌పేట్‌ నుంచి విమ్‌కో నగర్‌కు నిర్మించిన 9.01 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అలాగే.. ఐఐటీ మద్రాస్‌ డిస్కవరీ క్యాంప్‌సకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో కూడా ప్రధాని మోదీ ఆదివారం ఐదు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.6 వేల కోట్లతో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిర్మించిన ‘ప్రొపలీన్‌ డెరివేటివ్‌ పెట్రోకెమికల్‌ ప్రాజెక్టు (పీడీపీపీ)’ను జాతికి అంకితం చేశారు. 


అర్జున్‌.. హంటర్‌ కిల్లర్‌

అర్జున్‌ ఎంకే-1ఏ యుద్ధ ట్యాంకును భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన కంబాట్‌ వెహికిల్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ (సీవీఆర్డీఈ) అభివృద్ధి చేసింది. వీటిని హంటర్‌ కిల్లర్స్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ కొత్త అర్జున్‌ ట్యాంకులు 58.5 టన్నుల బరువు, 10.638 మీటర్ల పొడవు, 9.456 మీటర్ల వెడల్పు ఉంటాయి. వీటికి అత్యాధునికమైన 120ఎంఎం గన్‌లను అమర్చారు. ఎలాంటి వాతావరణంలోనైనా రేయింబవళ్లు సమర్థంగా పనిచేసేందుకు అనువుగా అధునాతన కెమెరాలను అమర్చారు. అర్జున్‌ ట్యాంకు భూతలంపై 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కొండ ప్రాంతాలు, ఎత్తుపల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. వాయుమార్గంలోని లక్ష్యాలపై దాడి చేసేలా 7.6 మి.మీ, 12.7 మి.మీ రకాల్లో రెండు అత్యాధునిక ఆయుధాలను అమర్చారు. ఒక ట్యాంకును కమాండర్‌తో పాటు ఫిరంగి షూటర్‌, తదితర నలుగురు ఆపరేట్‌ చేయవచ్చు. ఎదురుదాడుల్లోనే  కాదు స్వీయరక్షణలోనూ ఈ కొత్త అర్జున్‌ ట్యాంకు మేటి. ఈ నూతన తరం ట్యాంకుల్లో ఉండే ఎలకా్ట్రనిక్‌ వ్యవస్థలు మరే యుద్ధ ట్యాంకుల్లో లేవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

Updated Date - 2021-02-15T08:15:22+05:30 IST