తమిళ‘రాజు’ స్టాలిన్
ABN , First Publish Date - 2021-05-03T09:18:37+05:30 IST
నాన్న వెనుక నిలిచారు. నాన్న బాటలో నడిచారు. నాన్న తర్వాత... ఆయనే ‘నాయకుడు’ అయ్యారు. పదేళ్ల తర్వాత మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనే... కరుణానిధి ముద్దుల తనయుడు స్టాలిన్...
- విలక్షణ వ్యక్తిత్వం.. నాయకత్వ లక్షణం.. నాన్న వెనుక నిలిచి, పార్టీని నడిపించి..
నాన్న వెనుక నిలిచారు. నాన్న బాటలో నడిచారు. నాన్న తర్వాత... ఆయనే ‘నాయకుడు’ అయ్యారు. పదేళ్ల తర్వాత మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనే... కరుణానిధి ముద్దుల తనయుడు స్టాలిన్! అన్నాడీఎంకే-బీజేపీ ఎత్తులను చిత్తు చేసి... డీఎంకేను తమిళనాట మరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే తరువాయి! ఈ నేపథ్యంలో స్టాలిన్ జీవిత విశేషాల సమాహారం..
(చెన్నై - ఆంధ్రజ్యోతి)
స్టాలిన్ పూర్తిపేరు ‘ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్’. ముత్తువేల్ తాతపేరు. కరుణానిధి, దయాళు అమ్మాళ్ దంపతుల తృతీయ సంతానంగా 1953 మార్చి ఒకటిన జన్మించారు. నాలుగు రోజుల ముందే సోవియట్ యూనియన్ అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్ మృతి చెందటంతో చెన్నైలో సంతాప సభ జరిగింది. అందులో కరుణానిధి ప్రసంగిస్తున్న సమయంలోనే.. మగబిడ్డ జన్మించాడనే వార్త తెలిసింది. దీంతో స్టాలిన్‌పై అభిమానానికి గుర్తుగా తన బిడ్డకు ‘స్టాలిన్’గా నామకరణం చేస్తున్నట్లు కరుణానిధి సభ వేదికపైనే ప్రకటించారు.
ఎమర్జెన్సీలో అరెస్టు.. జైల్లో చిత్రహింసలు
స్టాలిన్ విద్యాభ్యాసమంతా చెన్నైలోనే సాగింది. పాఠశాల రోజుల్లో స్టాలిన్ హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్ ఆడేవారు. ఫిట్‌నె్‌సకు మంచి ప్రాధాన్యం ఇస్తారు. వాకింగ్, యోగా చేస్తారు. తీరిక దొరికినప్పుడల్లా సినిమాలకు వెళతారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ సినిమాలు, ఇంగ్లీషు సినిమాలు ఎక్కువ చూసేవారు. తండ్రి సంభాషణలు అందించిన సినిమాలనైతే ఒకటికి రెండుసార్లు చూసేవారు. 14 ఏళ్ల వయసులోనే స్నేహితులను కలుపుకొని యువజన విభాగాన్ని ప్రారంభించారు. 1967 ఎన్నికల్లోనే తన మేనమామ మురసొలి మారన్‌కు మద్దతుగా యువకులను వెంటబెట్టుకుని ప్రచారం చేశారు. 1973లో డీఎంకే సర్వసభ్య మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు కరుణానిధి సమక్షంలోనే ఆయనును అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసు చిత్రహింసల నుంచి స్టాలిన్‌ను కాపాడే ప్రయత్నంలో ఆయన స్నేహితుడు చిట్టిబాబు ప్రాణాలు కోల్పోయారు. జైలులో ఉండగానే స్టాలిన్ బీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యారు. కాగా, పార్టీ నేతల కోరికతో కరుణానిధి.. స్టాలిన్‌ను డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2006లో మంత్రిగా, 2009 మే 29న స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ బాధ్యతల్లో ప్రజా పథకాల అమలే ధ్యేయం గా స్టాలిన్ ముందుకెళ్లారు. కాగా, ఆది నుంచి బడాబడా నేతల మధ్య పెరిగినా స్టాలిన్‌లో ఎక్కడా ఆ దర్పం కనిపించదు. ఎవరు కలిసినా ఆత్మీయంగా, స్నేహితుడిలా పలుకరిస్తారు.
నేనే వారసుడిని..
స్టాలిన్.. కరుణానిధి రాజకీయ వారసత్వ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్లుగా వ్యవహరించారు. తన రాజకీయ వారసుడు స్టాలినేనంటూ కరుణానిధి దశాబ్దం క్రితమే ప్రకటించారు. దీంతో 2013లో సోదరుడు ఎంకే అళగిరితో విభేదాలు వచ్చాయి. ఈ ఎన్నికల సందర్భంగానూ స్టాలిన్ సీఎం కాకుండా అడ్డుకుంటానని ఆయన ప్రతిన బూనారు. కానీ స్టాలిన్ సంయమనంతో వ్యవహరించారు. సోదరిని రంగంలోకి దింపి అన్నను శాంతపరిచారు. ఇక జయ, కరుణానిధి కన్నుమూతతో.. ‘శూన్యత’ ఏర్పడిందని పలువురు ‘కొత్త పార్టీల’ ఆలోచనలు చేశారు. స్టాలిన్ వాటిని పటాపంచలు చేశారు.
ఆచితూచి ప్రసంగం
తండ్రి కరుణానిధిలా స్టాలిన్ గంభీరమైన ప్రసంగాలు చేయలేరు. సాధారణమైన పదజాలంతో అనర్ఘళంగా ప్రసంగిస్తారు. తప్పుడు సమాచారానికి తావు లేకుండా అంశాలను కాగితంపై రాసుకుని మాట్లాడతారు.
కుటుంబమంటే ప్రేమ
1975 ఆగస్టు 25న స్టాలిన్‌కు దుర్గా (అలియాస్ శాంత)తో వివాహమైంది. వీరికి కుమారుడు ఉదయనిధి, కుమార్తె శెందామరై ఉన్నారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు స్టాలిన్ నెలకు రెండు మూడు రోజులు కేటాయిస్తారు. సోదరుడు అళగిరి అంటే ఎంతో ఇష్టం. కన్నతల్లి దయాళు అమ్మాళ్‌పైనా, సవతితల్లి రాజాత్తి అమ్మాళ్‌పైనా ప్రేమాభిమానాలు మెండు. రాజాత్తి అమ్మాళ్ కుమార్తె కనిమొళి అన్నా ఇష్టం.
చెన్నై మేయర్‌గా అభివృద్ధి ముద్ర
1996లో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ పదవికి తొలిసారిగా జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో స్టాలిన్ గెలిచారు. చెన్నైని సుందరీకరించేందుకు ‘సింగార చెన్నై’ పేరుతో ప్రత్యేక పథకం రూపొందించారు. ఫ్లైవోవర్‌ల నిర్మాణంతో రూపురేఖలు మార్చారు. అయితే, 1984లో తొలిసారి చెన్నై థౌజెండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1989లో విజయం సాధించారు. మరో 3సార్లు నెగ్గారు. 2011లో కొళత్తూరుకు మారి.. విజయం సాధిస్తూనే ఉన్నారు. స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలవడం ఇది ఏడోసారి! స్టాలిన్‌ను సీఎం పీఠం 12 ఏళ్ల పాటు ఊరించింది. 2009 లోక్‌సభ ఎన్నికల ముందు కరుణానిధి తప్పుకుని స్టాలిన్‌ను సీఎం చేయాల నుకున్నారు. కానీ, కూటమికి ప్రధాన ఆధారంగా ఉన్న కాంగ్రెస్ ససేమిరా అంది.

జయతో సత్సంబంధాలు..
డీఎంకే-అన్నాడీఎంకే మధ్య ఉండే తీవ్ర వైరం స్టాలిన్ జమానా వచ్చాక మారింది. జయను పార్టీ నేతలు ఎవరెన్ని విధాలుగా దూషించినా, విమర్శించినా స్టాలిన్ పల్లెత్తు మాట అని ఎరుగరు. ఆమె సీఎంగా ఉండగా కలిసి తుఫాను బాధితులకు సాయం అందించారు. 2016లో జయ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరు కావడం రెండు పార్టీలను దిగ్ర్భాంతికి గురిచేసింది. జయ మరణానంతరం.. డీఎంకేలోకి దూకేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సిద్ధమైనా స్టాలిన్ వీల్లేదన్నారు. ‘ఇది జయ కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వం. ప్రజలు మనల్ని నమ్మి, అధికారం ఇచ్చేవరకూ వేచివుందాం’ అని తెగేసి చెప్పారు.
