లక్ష్మణచాంద మ్యాక్స్‌లో డబ్బుల గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2020-11-25T05:13:00+05:30 IST

లక్ష్మణచాంద మ్యాక్స్‌లో డబ్బుల గోల్‌మాల్‌

లక్ష్మణచాంద మ్యాక్స్‌లో డబ్బుల గోల్‌మాల్‌
లక్ష్మణచాందలోని పరస్పర పొదుపు మరియు పరపతి సహకార సంఘం కార్యాలయం, గోదాం

రూ. 33 లక్షల వరకు గల్లంతైనట్లు సభ్యుల ఆరోపణ 

22 లక్షలు ఇద్దరు సిబ్బంది వాడుకున్నట్లు సొసైటీ నిర్ధారణ

పోలీస్‌స్టేషన్‌ కు చేరిన పంచాయతీ

లక్ష్మణచాంద, నవంబరు 24 : మండలంలో గల లక్ష్మణచాంద పరస్పర పొదుపు మరియు పరపతి సహకార సంఘంలో రూ. 33 లక్షల వరకు గోల్‌మాల్‌ జరిగినట్లు దుమారం రేగుతోంది. ఈ విషయాల్లో సహకార సంఘం సిబ్బంది మరియు సంఘ డైరెక్టర్‌ల మధ్య చెలరేగిన పంచాయతీ పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. ఈ రైతు సహకార సంఘం లక్ష్మణచాంద  మరియు సమీప గ్రామాలకు చెందిన 545 మంది రైతుల సభ్యత్వంతో ఏర్పడింది. ఏర్పడిన అనతి కాలంలోనే కోట్ల టర్నోవర్‌తో లావాదేవీలు నిర్వహిస్తోంది. పలు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందు లను ఈ రైతు సహకార సంఘంలోనే కొనుగోలు చేయటంతో ఈ సంఘం లాభాల బాటలో పయనిస్తోంది. అయితే కంచె చేను మేసిన చందంగా ఇందులో పనిచేస్తున్న సిబ్బందే తమ చేతివాటం ప్రదర్శించటం ఈ డబ్బుల గోల్‌మాల్‌కు కారణమైందని తెలిసింది. స్టాకు నిల్వలు అమ్మకం రిజిస్టర్లు, నగదువసూలు, బ్యాంకులో జమ రిజిస్టర్లను పరిశీలించి లెక్కలు చేయగా ఇది వరకు పని చేసిన ఇద్దరు ప్రధానసిబ్బంది దండిగా చేతివాటం ప్రదర్శిం చినట్లు తెలిసిందని ఆ సంఘం డైరెక్టర్‌లే చెబుతున్నారు. చేతివాటం ప్రదర్శించిన ఈ ప్రధాన సిబ్బందిలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి 13 లక్షలు, లింబన్న అనే మరో వ్యక్తి 9 లక్షలు సొసైటీకి ఇవ్వవలసి ఉన్నట్లు కార్యవర్గం తేల్చిం దని సభ్యులు తెలిపారు. మిగితా డబ్బులు ఉద్దెర ఖాతా ద్వారా వసూలైన వని కొందరు, లేదు వసూలు కావాల్సి ఉందని మరికొందరూ బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో సభ్యత్వం కలిగిన రైతులందరూ అసలేం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. చేతివాటం ప్రదర్శించిన సిబ్బంది వద్ద ఏలాగైన డబ్బులు వసూలు చేయాలని గత ఆదివారం డైరెక్టర్లందరితో సమావేశం నిర్వహించినప్పటికీ ఇంకా వ్యవహరమంతా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అలాగే ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం, సహకార సంఘం అధికారులు జోక్యం చేసుకొని లెక్కలు సక్రమంగా చేసి గోల్‌మాల్‌ అయిన డబ్బులను తిరిగి రాబట్టాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-11-25T05:13:00+05:30 IST