భారత్‌కు పోటీగా పాక్ క్షిపణి ప్రయోగం.. సింధ్ ప్రావిన్స్‌లో కుప్పకూలిన క్షిపణి

ABN , First Publish Date - 2022-03-19T01:59:20+05:30 IST

భారత్ నుంచి ఓ క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలోకి దూసుకెళ్లడంపై గుర్రుమీదున్న పాక్.

భారత్‌కు పోటీగా పాక్ క్షిపణి ప్రయోగం.. సింధ్ ప్రావిన్స్‌లో కుప్పకూలిన క్షిపణి

న్యూఢిల్లీ: భారత్ నుంచి ఓ క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలోకి దూసుకెళ్లడంపై గుర్రుమీదున్న పాక్.. తాజాగా ఓ భంగపాటు పని చేసింది. భారత్‌కు తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించే ఉద్దేశంతో చేపట్టిన క్షిపణి పరీక్ష బెడిసికొట్టింది. తొలుత ఈ క్షిపణిని గురువారం ఉదయం 11 గంటలకు సింధ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించాలని నిర్ణయించారు. అయితే, ఆ తర్వాత ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టార్ లాంచర్ (టీఈఎల్)లో వైఫల్యాన్ని గమనించి ప్రయోగాన్ని గంటపాటు వాయిదా వేశారు.


ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో క్షిపణిని పరీక్షించగా అది కాస్తా విఫలమై కుప్పకూలింది. ఓ గుర్తు తెలియని వస్తువు పొగలు కక్కుతూ ఆకాశం నుంచి  నేలపై పడడాన్ని సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో గ్రామస్థులు గమనించారు. క్షిపణిని పరీక్షించిన కాసేపటికే అది లక్షిత మార్గం నుంచి పక్కకు జరిగి సింధ్‌లోని థానా బులా ఖాన్ ప్రాంతంలో కుప్పకూలింది.


ఈ ఘటనపై ప్రభుత్వం మౌనం దాల్చినా కొన్ని స్థానిక మీడియా చానళ్లు మాత్రం ఈ వార్తను ప్రసారం చేశాయి. భారత బ్రహ్మోస్ మిసైల్ పాక్ భూభాగంలోకి చొచ్చుకొచ్చినందుకు ప్రతీకారంగానే పాక్ ఈ మిసైల్‌ను ప్రయోగించినట్టు స్థానిక మీడియా తెలిపింది. లక్ష్యాన్ని తాకడంలో అది విఫలమై సమీపంలోనే కుప్పకూలిందని పేర్కొంది.  

Updated Date - 2022-03-19T01:59:20+05:30 IST