త్రుటిలో తప్పిన ముప్పు

ABN , First Publish Date - 2021-10-21T05:21:14+05:30 IST

పలాస జాతీయ రహదారి కంబిరిగాం బైపాస్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద పెను ప్రమాదం తప్పింది. బుధవారం తెల్లవారుజామున కోల్‌కతా, బారిపడ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు రోడ్డుకు అడ్డంగా వేసిన మట్టిలో కూరుకుపోయింది. బస్సులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

త్రుటిలో తప్పిన ముప్పు
రోడ్డుపై నిరీక్షిస్తున్న ప్రయాణికులు ..(ఇన్‌సెట్‌లో)మట్టిలో కూరుకుపోయిన బస్సు

ఫ్లైఓవర్‌ వద్ద మట్టిలో కూరుకుపోయిన ప్రైవేటు బస్సు

సురక్షితంగా బయటపడిన 60 మంది కూలీలు

పలాస బైపాస్‌ వద్ద సంఘటన

కంబిరిగాం(పలాస), అక్టోబరు 20: పలాస జాతీయ రహదారి కంబిరిగాం బైపాస్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద పెను ప్రమాదం తప్పింది. బుధవారం తెల్లవారుజామున కోల్‌కతా, బారిపడ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు రోడ్డుకు అడ్డంగా వేసిన మట్టిలో కూరుకుపోయింది. బస్సులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లో కోల్‌కతా, ఒడిశాలోని బారిపడ, కటక్‌ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది వలస కూలీలు.. కోయంబత్తూరులో వివిధ కంపెనీల్లో పని చేసేందుకు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మంగళవారం ఉదయం పయనమయ్యారు. బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో కంబిరిగాం వద్ద మట్టి దిబ్బలపైకి బస్సు దూసుకెళ్లిపోయింది. అక్కడ బ్రిడ్జి పనులు జరుగుతుండగా... రోడ్డుకు అడ్డంగా  మూడు అడుగుల ఎత్తులో మట్టిరక్షణ గోడను ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు పెట్టారు. చీకటిలో మట్టిగోడలు కనిపించకపోవడంతో బస్సు వాటిలో కూరుకుపోయింది. నిద్రమత్తులో ఉండగా ఈ సంఘటన చోటుచేసుకోవడంతో వలస కూలీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో  ఊపిరి పీల్చుకున్నారు. బస్సు మరో రెండు అడుగులు ముందుకెళ్లి గోడను ఢీకొంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు పేర్కొంటున్నారు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శంకరరావు తన బృందంతో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రయాణికులకు అల్పాహారం, టీ అందజేశారు. పలాస సత్యసాయిసేవా సమితి కన్వీనరు మల్లా శరత్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్టు చైర్మన్‌ మల్లా రామేశ్వరరావు తమ సభ్యులతో స్నాక్స్‌, మధ్యాహ్న భోజనం అందించారు. అనంతరం ట్రావెల్స్‌ ఏజెన్సీ మరో బస్సును ఒడిశా నుంచి పంపించి వారందరినీ కోయంబొత్తూరు తరలించింది.


 హెచ్చరిక  బోర్డులేనందునే...

హైవేపై పనులు జరుగుతుండడంతో డైవర్షన్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ కంబిరిగాం బ్రిడ్జి పనులు జరుగుతుండగా కేవలం స్టాప్‌ బోర్డు మా త్రమే ఏర్పాటు చేశారు. రెండు రోజుల కిందట ఓ వాహనం ఈ విధంగానే దారి తెలియక మట్టి గోడలను ఢీకొన్నట్లు ఎస్‌ఐ శంకరరావు తెలిపారు. కాంట్రాక్టర్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు వాపోతున్నారు.

Updated Date - 2021-10-21T05:21:14+05:30 IST