మాట తప్పి.. మడమ తిప్పిన జగన్‌!

ABN , First Publish Date - 2022-08-15T04:54:11+05:30 IST

కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ మాట తప్పి మడమ తిప్పాడ ని కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు.

మాట తప్పి.. మడమ తిప్పిన జగన్‌!
సమావేశంలో మాట్లాడుతున్న లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 14: కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ మాట తప్పి మడమ తిప్పాడ ని కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. చిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ, రేషన్‌కార్డులను తొలగించి, సంక్షేమ ఫలాలను దూరంచేశారని జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆదుకుంటామని, తాను అధికారంలోకి వస్తూనే, వారి ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని మాయమాటలు చెప్పి, వారితో ఓట్లు దండుకుని, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా క్రమబద్దీకరించకపోగా, ఉద్యోగం పేరిట వారికి ఉన్న రేషన్‌కార్డులను తొలగించడం దారుణమన్నారు. ఇలా రెండున్నర లక్షల ఉద్యోగులకు రేషన్‌కార్డులను తొలగించి, ఆ కుటుంబాల్లో వారికి పెన్షన్‌, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాం టి సంక్షేమ ఫలాలను దూరం చేశారని ఘాటుగా విమర్శించారు. ఇది కూడా వైసీపీ ప్రభుత్వ బాదుడులో భాగమేనన్నారు. ఇదివరకే రాష్ట్రంలో ఇంటిపన్నులు రిజిస్ట్రేషన్‌ అధారితంగా పన్ను పెంచి ఇప్పుడు కొత్తగా రోడ్డు పక్కన నిర్మాణాలు చేపడితే, వాటికి ఇంపాక్టు పన్ను వసూలుకు సిద్దపడటం దుర్మార్గమన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కరెంట్‌ చార్జీ లు పెంచకపోయినా, పెంచేశారని బాదుడే బాదుడంటూ గగ్గోలు పెట్టి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, ఒక విద్యుత్తు చార్జీలతోనే ప్రజలపై రూ.11వేల కోట్లు భారం మోపారన్నారు. ప్రతి విషయంలో మాట తప్పడం జగన్‌ నైజమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన 10లక్షల రేషన్‌ కార్డులను వెంటనే పునరుద్దరించాలని, కాంపాక్టు పన్ను వసూలు మానుకోవాలని ఆయన డిమాండు చేశారు. సమావేశంలో టీడీపీ కడప పార్లమెంట్‌ కార్యదర్శి సిద్దయ్య, టీడీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రప్పయాదవ్‌, మాజీ కౌన్సిలర్‌ జి.సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T04:54:11+05:30 IST