జూన్‌ 1న డెల్టా కాలువలకు నీరు

ABN , First Publish Date - 2022-05-18T06:34:00+05:30 IST

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మేరకు జూన్‌ 1న డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించనున్నామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు.

జూన్‌ 1న డెల్టా కాలువలకు నీరు

మంత్రి దాడిశెట్టి రాజా
కాకినాడ సిటీ, మే 17: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మేరకు జూన్‌ 1న డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించనున్నామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. 2022 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి కాకినాడ జిల్లా నీటి పారుదల సలహా మండలి, జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాలు మంగళవారం కాకినాడలోని కలెక్టరేట్‌ వివేకానంద హాల్‌లో జరిగాయి. మంత్రి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీత, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఇలాక్కియా, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, అనంత  ఉదయభాస్కర్‌, ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ద్వారంపూడి భాస్కరరెడ్డి, దవులూరి దొరబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ లంక ప్రసాద్‌ హాజరయ్యారు. సమావేశంలో తొలుత ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ బి రాంబాబు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జిల్లాలో సాగునీటి వనరులు, పంట కాలువలు, డ్రెయిన్లు, మండలాల వారీగా ఆయకట్టు వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ కొన్నేళ్లుగా నవంబరులో భారీ వర్షాలు కారణంగా రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు ఒక నెల ముందుగానే జూన్‌ 1వ తేదీ నుంచే ఖరీఫ్‌ పంట ప్రణాళికను అమలు చేసేలా ముఖ్యమంత్రి సూచించారన్నారు. జూన్‌ 1న గోదావరి తూర్పు డెల్టా, పుష్కర ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంపీ గీత మాట్లాడుతూ రైతుల శ్రేయస్సుకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలకు ప్రకృతి కూడా సహకరించి పంటలు బాగా పండి, అన్నదాతల ఇంట వెలుగులు నిండుతున్నాయన్నారు. ప్రతి దశలోను ఆర్‌బీకేలు రైతులకు అండగా నిలుస్తున్నాయన్నారు. సాగుకు సంబంధించి ఏ దశలోను రైతుకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో పటిష్ట ప్రణాళికను కేలండర్‌ ప్రకారం అమలు చేయాలని ఖరీఫ్‌ సీజన్‌పై  విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామన్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రైతులకు సంబంధించిన పలు అంశాలను లేవనెత్తారు. కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ ఖరీఫ్‌కు సంబంధించి నీటి పారుదల ప్రణాళికపై ఈ నెల 21న మండల స్థాయిలో సమావేశాలు జరగనున్నాయన్నారు. అదే విధంగా 23వ తేదీన ఆర్‌బీకే స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశాల ద్వారా ఖరీఫ్‌ ప్రణాళికపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నామని చెప్పారు. జిల్లా స్థాయి సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.విజయకుమార్‌, ఏపీఎంఐపీ పీడీ ఎస్‌.రామ్మోహనరావు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఎస్‌ఈ శ్రీనివాస్‌యాదవ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T06:34:00+05:30 IST