వాహనమిత్రతో 18,668కి లబ్ధి: మంత్రి పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2020-06-05T10:54:34+05:30 IST

జిల్లాలో 18,668 మందికి వాహనమిత్ర పథకం కింద లబ్ధి చేకూరుస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు.

వాహనమిత్రతో 18,668కి లబ్ధి: మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 4: జిల్లాలో 18,668 మందికి వాహనమిత్ర పథకం కింద లబ్ధి చేకూరుస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చేనెల 8న దివంగత మాజీ సీఎం వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో 27లక్షల మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది 15లక్షల గృహ నిర్మాణాలు కూడా చేపడతామన్నారు.డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ ప్రతి ఇంటికీ తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు, రెండెకరాలున్న రైతులకు బోర్లను అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అంతకుముందు వెలగపూడిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ భరత్‌గుప్తా మాట్లాడుతూ.. వాహనమిత్ర పథకం కింద జిల్లాలోని లబ్ధిదారులకు రూ.18.66 కోట్ల సాయం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.


వాహనమిత్ర పథక లబ్ధిదారురాలు నాగమణి మాట్లాడుతూ  తన భర్త మూడేళ్ల కిందట గుండెపోటుతో చనిపోవడంతో ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు చెప్పారు. తన సంపాదన పిల్లల తిండికి సరిపోయినా, వారి విద్య తదితర విషయాలు అన్నయ్యే(సీఎం) చూసుకుంటారని నవ్వుతూ చెప్పారు.ఎంపీ ఎం.రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఆరణి శ్రీనివాసులు, ఎమ్మె్‌సబాబు, నవాజ్‌బాషా, జేసీలు మార్కొండేయులు, వీరబ్రహ్మం, చంద్రమౌళి, డీసీసీబీ చైర్‌పర్సన్‌ రెడ్డమ్మ, డీటీసీ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఆ ఫోటో మార్చండయ్యా! 

   ఇంకా పాతకాలం నాటి ఫొటో పెడితే ఎలా? సీఎం హోదాలో జగన్‌ ఉన్న ఫొటో ఉంచండని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో  జగన్‌ పాత ఫొటో ఉండడం చూసిన మంత్రి అలా స్పందించారు. 

Updated Date - 2020-06-05T10:54:34+05:30 IST