అగ్రి బిజినెస్‌కు ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2020-06-04T09:18:38+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అగ్రి బిజినెస్‌ ఏర్పాటుకు కృషి చేస్తుందని, ప్రతి జిల్లాలో 500ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన చేయబోతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

అగ్రి బిజినెస్‌కు ప్రభుత్వం కృషి

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి


వికారాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అగ్రి బిజినెస్‌ ఏర్పాటుకు కృషి చేస్తుందని, ప్రతి జిల్లాలో 500ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన చేయబోతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని గౌలీకార్‌ ఫంక్షన్‌హాల్‌లో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌ నిజమైన రైతు అని.. రైతు కష్టం తెలుసు కాబట్టి వారు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. మొక్కజొన్న పంట వేయొద్దనడానికి బలమైన కారణముందనే విషయాన్ని రైతులు గ్రహించాలన్నారు. వికారాబాద్‌ జిల్లాలో 28వేల ఎకరాల్లో మొక్కజొన్నపంట సాగు చేస్తున్నారని, ప్రభుత్వం రూ.1,760కి కొనుగోలు చేస్తే.. పక్క రాష్ట్రాలవారు పౌల్ర్టీ ఫారాలకు క్వింటాలకు రూ.700 నుంచి రూ.800లకు అందజేస్తున్నారన్నారు.


ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్నను పౌలీ్ట్ట్ర వ్యాపారులు రూ. 1,150కి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి వచ్చిన కష్టం రైతుకు రావద్దని ముఖ్యమంత్రి ఆ దిశగా పంట మార్పిడి జరగాలని యోచిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అగ్రిబిజినె్‌సలో భా గంగా ప్రతి జిల్లాలో 500 ఎకరాలు తీసుకుంటామని, వికారాబాద్‌ లేదా తాండూరులో భూసేకరణకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో అన్నిరకాల పంటలు పండించి.. పసుపు, మిరప పొడి చేసేందుకు మిషన్లు, జిన్నింగ్‌ మిషన్లు, రైస్‌మిల్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. రాష్ట్రంలో కంది పంటను 15లక్షల ఎకరాల్లో పండించేందుకు ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు.


మూడు నెలల్లో క్లస్టర్‌ వారీగా వ్యవసాయ భవనాలను ఏర్పాటు చేస్తామని, అక్కడ ఏఈవో ఉండి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారన్నారు. రైతులు కల్లాలు చేసుకుంనేందుకు పొలంలోనే ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు అందిస్తుందన్నారు. రైతులు మొక్కజొన్నకు బదులు పత్తి, కందులు, స్వీట్‌కార్న్‌, కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. రైతుల కోసం విత్తనాలను అందుబాటులో ఉంచుతామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీయాక్ట్‌ పెడుతామని హెచ్చరించారు. జిల్లాలో 20 ఎకరాల్లో గోదాంలు, కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.


జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎర్ర, నల్లరేగడి భూముల్లో దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం సూచించిన పంటలను వేసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షాధార పంటలనే పండిస్తారని, అందుకోసం కొత్తవిధానం అలవర్చుకోవాలన్నారు. ఈనెల 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, డీఏవో గోపాల్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.


పంచాయతీరాజ్‌ రిసోర్ట్స్‌ సెంటర్‌ ప్రారంభం

వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని మద్గుల్‌ చిట్టంపల్లి వద్ద రూ.2కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్‌ రిసోర్ట్స్‌ సెంటర్‌ (డీపీఆర్‌సీ) భవనాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. అనంతరం వికారాబాద్‌ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను పరిశీలించారు. 


Updated Date - 2020-06-04T09:18:38+05:30 IST