ఫ్యాక్టరీల్లో సమగ్ర తనిఖీలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-06-03T11:36:42+05:30 IST

జిల్లా లోని పలు ఫ్యాక్టరీల్లో సమగ్ర తనిఖీలు చేపట్టి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాటిపై నివేదికలు ..

ఫ్యాక్టరీల్లో సమగ్ర తనిఖీలు చేపట్టాలి

మంత్రి  కురసాల కన్నబాబు 


సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), జూన్‌ 2: జిల్లా లోని పలు ఫ్యాక్టరీల్లో సమగ్ర తనిఖీలు చేపట్టి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాటిపై నివేదికలు అందజేయాలని వ్యవసాయ, సహకార మంత్రి  కురసాల కన్నబాబు ఆదేశించారు. వైద్యనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఫ్యాక్టరీస్‌, పొల్యూషన్‌, రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సర్పవరంలో టైకీ ఇండస్ట్రీ్‌సలో గ్యాస్‌ లీకేజీ వదంతులపై చర్చించారు. గ్రామస్థుల్లో నెలకొన్న ఆందోళనలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులు, కంపెనీ యాజమాన్యంపై ఉందన్నారు. బుధవారం మరోసారి ఆర్డీవోతో కలిసి ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌, పొల్యూషన్‌ అధికారి, స్థానికులతో కలిసి ఇండస్ట్రీ్‌సలో సమగ్రంగా తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని మంత్రి ఆదేశించారు.


సర్పవరంతోపాటు జిల్లాలోని గ్యాస్‌, మిథైల్‌ వంటి రసాయన కెమికల్స్‌ వాడే ఫ్యాక్టరీల్లో వాటి స్టోరేజి, తీసుకుంటున్న భద్రత చర్యలపై క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టైకీ ఇండస్ట్రీ్‌సలో నిర్వహించిన తనిఖీపై కాకినాడ ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.సురేష్‌ మంత్రికి వివరించారు. ఇండస్ట్రీలో ఉత్పత్తవుతున్న ప్రొడక్ట్‌, తీసుకుంటున్న భద్రతా చర్యలపై ఫ్యాక్టరీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. సమీక్షలో కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ, పొల్యూషన్‌ ఈఈ రామారావునాయుడు, తహశీల్దార్‌ వేముల మురళీకృష్ణ, సీఐ ఆర్‌.గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-03T11:36:42+05:30 IST