Minister కేటీఆర్‌జీ.. యే క్యాహై.. నాడు.. నేడు.. పదే పదే ఎందుకిలా..!

ABN , First Publish Date - 2022-02-20T11:57:03+05:30 IST

Minister కేటీఆర్‌జీ.. యే క్యాహై.. నాడు.. నేడు.. పదే పదే ఎందుకిలా..!

Minister కేటీఆర్‌జీ.. యే క్యాహై.. నాడు.. నేడు.. పదే పదే ఎందుకిలా..!

  • పురపాలక శాఖ మంత్రి తీరులో మార్పు
  • ఫ్లెక్సీలు, కటౌట్లను పట్టించుకోని వైనం
  • నాడు ప్లీనరీ.. తాజాగా కేసీఆర్‌ జన్మదినం
  • ఇష్టారాజ్యంగా నిబంధనల ఉల్లంఘన
  • ఫ్లెక్సీలపై స్పందించని మంత్రి
  • జీహెచ్‌ఎంసీ పెనాల్టీ విధింపు అంతంతేనా?
  • పుట్టినరోజు ఫ్లెక్సీలకు రూ. 55 వేల వరకు జరిమానాలు
  • ప్లీనరీ సందర్భంగా ట్విటర్‌ ఖాతా నిలిపివేత

హైదరాబాద్‌ సిటీ : ‘నగరంలో ఫ్లెక్సీలు ఉండడానికి వీల్లేదు. అది విపక్షాలే అయినా టీఆర్‌ఎస్‌ నేతలే అయినా జరిమానా విధిస్తాం..’ గతంలో మంత్రి కేటీఆర్‌ అన్న మాటలివి. అప్పట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు కఠిన చర్యలే తీసుకున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్లపై ఫిర్యాదుల స్వీకరణకు ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. ఆయా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఓ యంత్రాగాన్నే ఏర్పాటు చేసి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌(సీఈసీ-ఈవీడీఎం)లో రియల్‌-టైం డేటా, యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టులను అప్‌లోడ్‌ చేసేవారు. స్వయంగా మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, నాయకులకు జరిమానాలు విధించారు. మరోసారి అలా చేయొద్దంటూ కేటీఆర్‌ సున్నితంగా హెచ్చరించారు. కానీ.. ఇటీవల టీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు, బ్యానర్ల హంగామా కొనసాగుతోంది. అధికార పార్టీ కావడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు. టీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన చట్టాలను ఆ పార్టీ నేతలే ఉల్లంఘిస్తున్నారు.


సీఎం పుట్టినరోజు సందర్భంగా..

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం నేపథ్యంలో అధికార పార్టీ నేతల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ప్రధాన, అంతర్గత రహదారులు అన్న తేడా లేకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు, కటౌట్లు, చౌరస్తాల వద్ద తోరణాలు కట్టారు. నెక్లె్‌సరోడ్‌ ఇందిరాగాంధీ చౌరస్తాలో కేసీఆర్‌, కర్మన్‌ఘాట్‌, సాగర్‌ సొసైటీ తదితర ప్రాంతాల్లో కేసీఆర్‌, కేటీఆర్‌లతోపాటు స్థానిక నేతల భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. దీనిపై నెటిజన్లు ట్విటర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానముంటే.. స్వయంగా కలిసి శు భాకాంక్షలు తెలపాలే కానీ, రోడ్లపై ఇష్టారాజ్యంగా కటౌట్లేంటంటూ నిలదీశారు. నిబంధనలను రూపొందించిన వారే ఉల్లంఘించడం సమంజసమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈవీడీఎం విభాగానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు. చిరునామాలు, వ్యక్తుల పేర్లు సరిగాలేవంటూ అధికారులు దాటవేశారు. తూతూమంత్రంగా రూ. 55వేల మేర జరిమానాలు విధించారు.


ప్లీనరీ సమయంలో దారుణం

గత ఏడాది అక్టోబరులో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరిగినప్పుడు పరిస్థితి మరీ దారుణం. టీఆర్‌ఎస్‌ పార్టీ నగర అలంకరణ ప్రారంభించిన మరునాడే.. సీఈసీ-ఈవీడీఎం ట్విటర్‌ ఖాతాను స్తంభింపజేశారు. సాంకేతిక కారణాలను బూచీగా చూపారు. ప్లీనరీ ముగిసిన రెండు రోజుల దాకా ఇదే తంతు. ఆ తర్వాత ఫిర్యాదుల స్వీకరణను పునరుద్ధరించారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాంతో.. రూ.10లక్షల దాకా జరిమానాలు విధించారు. ఫ్లెక్సీల విషయంలో మంత్రి కేటీఆర్‌ మొదట్లో చూపిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. అదే సమయంలో ఇతర పార్టీలు ఫ్లెక్సీలు, కటౌట్లు పెడితే జీహెచ్‌ఎంసీ అధికారులు ఠంచనుగా జరిమానాలు విధిస్తున్నారు.


జరిమానాలూ తూతూమంత్రమే

సీఈసీ-ఈవీడీఎం అధికారులు టీఆర్‌ఎస్‌ వర్గీయులపై జరిమానాలైతే విధిస్తున్నారు కానీ, వసూళ్ల విషయంలో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్లీనరీ, కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా విధించిన జరిమానాల్లో 30శాతం కూడా వసూలు కాలేదు. ఇక, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, తోరణాలకు విధించిన జరిమానాల్లో ఇప్పటికి వసూలైందని 10శాతంలోపే అని ఈవీడీఎం వర్గాలే చెబుతున్నాయి. ఇటీవల అధికారులు పెనాల్టీలు చెల్లించలేదంటూ పలు వాణిజ్య భవనాలను సీజ్‌ చేశారు. కానీ, రాజకీయ నేతల ఫ్లెక్సీల విషయంలో అడుగు ముందుకు పడడం లేదు.

Updated Date - 2022-02-20T11:57:03+05:30 IST