రీకౌంటింగ్‌కు మంత్రి కొప్పుల ముందుకురావాలి

ABN , First Publish Date - 2022-08-20T05:03:36+05:30 IST

ధర్మపురి నియోజకవర్గం ఫలితాలపై రీకౌంటింగ్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముందుకురావాలని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

రీకౌంటింగ్‌కు మంత్రి కొప్పుల ముందుకురావాలి
సమావేశంలో మాట్లాడుతున్న జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

  జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 19: ధర్మపురి నియోజకవర్గం ఫలితాలపై రీకౌంటింగ్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముందుకురావాలని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌  డిమాండ్‌ చేశారు. శుక్రవారం కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో మొదటినుంచి తాను ఆధిక్యంలో ఉన్నానని, చివరి రౌండ్‌ ముగిసే సమయానికి కొప్పుల ఈశ్వర్‌ 441 ఓట్లతో గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారన్నారు. తాను అభ్యంతరం తెలిపి చివరి నిమిషంలో అవకతవకలు జరిగాయని, రీకౌంటింగ్‌ జరపాలని హైకోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. హైకోర్టు రీకౌంటింగ్‌ జరపాలని తీర్పు ఇచ్చిందని, రీకౌంటింగ్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ మంత్రి సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించిందిన్నారు. ఈనెల 24న హైకోర్టులో ఈ కేసు విషయంలో హియరింగ్‌ ఉన్నందున మంత్రికి చిత్తశుద్ధి ఉంటే తన న్యాయవాదితో రీకౌంటింగ్‌కు ఒప్పుకుంటున్నట్లు పిటిషన్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేశారు. చివరి నిమిషంలో 11 ఈవీఎంలు మొరాయించాయని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, వీవీప్యాట్‌ స్లిప్‌లను మరోసారి లెక్కించాలని అప్పటి కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని కోరినట్లు తెలిపారు. ఆ సమయంలో బయటకు వెళ్లివచ్చిన కలెక్టర్‌ అన్ని సజావుగా ఉన్నాయని చెప్పారన్నారు. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత ఒత్తిడితోనే ఫలితాలు తారుమారు చేశారని లక్ష్మణ్‌కుమార్‌ విమర్శించారు. ఓట్ల లెక్కింపు సమయంలో వీడియో ఫుటేజీలను, కౌంటింగ్‌ పూర్తి వివరాలను అందించాలని సమాచారహక్కు చట్టంకింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇవ్వడంలేదన్నారు. లెక్కింపు సమయంలో తనకు అందజేసిన పత్రాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లలో ఒక శాతం తేడా ఉందన్నారు. ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోవాలని లేదని, తనకు జరుగుతున్న అన్యాయంపై, ధర్మపోరాటంపై ధర్మపురి ప్రజలకు నిజానిజాలు తెలియాలనే ఉద్దేశం మాత్రమే ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ నిజంగా దళిత పక్షపాతి అయితే ఒక దళితుడిగా నాకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ సిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T05:03:36+05:30 IST