అవ్వా.. నేనెవ్వల్ని

ABN , First Publish Date - 2022-05-25T05:50:08+05:30 IST

‘అవ్వా.. నేనెవ్వల్ని గుర్తుపట్టినవా’.. అని మంత్రి ప్రశ్నించగా... ‘మాకు సూపు తెప్పించిన తండ్రి హరీశ్‌రావా’ అంటూ వృద్ధులు పలకరించారు. ఈ ఆత్మీయ సంభాషణకు సిద్దిపేట శివారులోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి వేదికైంది. సిద్దిపేట నియోజకవర్గంలో కంటి సమస్యలున్నవారికి సిద్దిపేట సమీపంలోని కొండపాక మండలం నాగులబండ వద్ద ఉన్న ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, సర్జరీలు చేయిస్తున్నారు.

అవ్వా.. నేనెవ్వల్ని
ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రిలో కంటి సర్జరీ చేసుకున్న వృద్ధురాలితో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో కంటి ఆపరేషన్‌ చేసుకున్నవారికి మంత్రి హరీశ్‌ ఆత్మీయ పలకరింపు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి/కొండపాక, మే 24: ‘అవ్వా.. నేనెవ్వల్ని గుర్తుపట్టినవా’.. అని మంత్రి ప్రశ్నించగా... ‘మాకు సూపు తెప్పించిన తండ్రి హరీశ్‌రావా’ అంటూ వృద్ధులు పలకరించారు. ఈ ఆత్మీయ సంభాషణకు సిద్దిపేట శివారులోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి వేదికైంది. సిద్దిపేట నియోజకవర్గంలో కంటి సమస్యలున్నవారికి సిద్దిపేట సమీపంలోని కొండపాక మండలం నాగులబండ వద్ద ఉన్న ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, సర్జరీలు చేయిస్తున్నారు. చికిత్స జరుగుతున్న తీరును మంగళవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా పరిశీలించారు. ఆయన సందర్శించిన సమయంలో చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌కు చెందిన సుమారు 15 మంది వృద్ధులు ఆస్పత్రిలో ఉన్నారు. వీరందరికీ క్యాటరాక్ట్‌ సర్జరీలు ఉచితంగా నిర్వహించారు. మంత్రి ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఆస్పత్రిలో వసతులు, భోజనం, ఇతర సౌకర్యాల గురించి అడిగారు. అవ్వా అంటూ పలకరించగా వారు ఉద్వేగానికి లోనయ్యారు. పలువురు ఆయనకు పాదాభివందనం చేసే ప్రయత్నం చేయగా వారించి వారి చేతులు పట్టుకొని ఆశీస్సులు తీసుకున్నారు. రంది పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాల గ్రామాల్లో అందరికీ చెప్పాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో కంటి సమస్యలతో బాధపడేవారందరికీ ఉచిత వైద్యం చేయిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కంటి సమస్యలు వంద శాతం పరిష్కారం చేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో కంటిచూపు లేక కిందపడి కాళ్లు, చేతులు విరిగి మంచం పడుతున్నారని వాపోయారు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి గ్రామాల్లో ఉచిత క్యాంపులు ఏర్పాటు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరికీ రూ.18 వేల నుంచి రూ.25 వేల ఖర్చయ్యే కంటి పరీక్షలు, ఆపరేషన్‌ ఉచితంగా చేయిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో 10 వేల మంది వరకూ కంటి సమస్యతో బాధపడుతున్నట్టు అంచనా ఉందని తెలిపారు. ప్రతీరోజు 15 నుంచి 20 మందికి పరీక్షలు జరిపి ఆపరేషన్‌ చేయాలని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రివర్గాలను ఆదేశించారు. నిత్యం ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ జరపాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కాశీనాథ్‌కు సూచించారు. జిల్లావ్యాప్తంగా ప్రతీరోజు 80 మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారని, వారికి చికిత్స చేయడం కోసం అదనంగా ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేయాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్‌లో సూచించారు. ఆయనవెంట జడ్పీ చెర్‌పర్సన్‌ రోజాశర్మ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాయిరాం తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-25T05:50:08+05:30 IST