- అట్టుడికిన శాసనసభ ఉభయసభలు
బెంగళూరు: భూకబ్జా కేసుకు సంబంధించి కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి బైరతి బసవరాజ్ రాజీనామా చేయాల్సిందేనంటూ శాసనసభ ఉభయసభలలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ సోమవారం గట్టిగా డిమాండ్ చేసింది. శాసనసభ ఉదయం సమావేశం అవుతూనే ప్రతిపక్షనేత సిద్దరామయ్య ఈ అంశాన్ని లేవనెత్తారు. వాయిదా తీర్మానానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపక్షనేత సిద్దరామయ్య డిమాండ్ చేయగా, ఎంఈఎస్ ఆకతాయిల వ్యవహారంపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ జేడీఎస్ సభ్యులు పట్టుబట్టారు. కేంద్రమాజీ మంత్రి ఆర్ఎల్ జాలప్పకు సంతాపం ప్రకటించిన అనంతరం కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి మంత్రి బైరతి బసవరాజ్ రాజీనామాకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎగువసభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సభాపతి బసవరాజ్ హొరట్టి కాంగ్రెస్ సభ్యుల డిమాండ్‌ను పక్కనబెట్టి ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సిద్ధం కాగా సభ్యులు పోడియంలోకి వచ్చి ధర్నా ప్రారంభించారు. సభాపతి కాంగ్రెస్ నేతలను తన చాంబర్లోకి పిలిపించి చర్చలు జరిపినా ప్రయోజనం లభించలేదు. మొత్తానికి మంత్రి రాజీనామా డిమాండ్‌తో శాసనసభ ఉభయసభలు అట్టుడికాయి.
ఇవి కూడా చదవండి