మొండిగౌరెల్లిలో మళ్లీ మైనింగ్‌ కలకలం

ABN , First Publish Date - 2022-07-02T05:09:32+05:30 IST

యాచారం మండలం మొండిగౌరెల్లిలో మళ్లీ మైనింగ్‌జోన్‌

మొండిగౌరెల్లిలో మళ్లీ మైనింగ్‌ కలకలం
క్రషర్లు బిగించడం కోసం మొండిగౌరెల్లికి వస్తున్న కాంక్రీట్‌ వాహనాలు

  • క్రషర్‌ మిషన్ల బిగింపు పనులు మొదలు పెట్టిన వ్యాపారులు  
  • కాంక్రీట్‌ లారీలను అడ్డుకున్న మొండిగౌరెల్లి వాసులు 
  • క్రషర్లు బిగిస్తే వీధిన పడతామని ఆందోళన చెందుతున్న గ్రామస్థులు
  • అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం 


యాచారం, జూలై  1 : యాచారం మండలం మొండిగౌరెల్లిలో మళ్లీ మైనింగ్‌జోన్‌ కలవరం మొదలైంది. వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా క్రషర్లు బిగింపు పనులు చేయిస్తున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్‌ 19 భూమిలో క్రషర్‌ మిషన్‌ బిగించడానికి కాంక్రీట్‌ పనులు శుక్రవారం ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న లారీలను అడ్డుకోవడానికి మొండిగౌరెల్లి గ్రామస్థులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పట్టాభూములకు ఆనుకొని క్రషర్లు బిగిస్తే తామెలా బతకాలని ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మైనింగ్‌జోన్‌ కింద క్రషర్లు బిగించడానికి అనుమతి ఇవ్వబోమని చెప్పిన నాయకులు ప్రజాప్రతినిధులు  ఇప్పుడు ఎక్కడకి పోయారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మైనింగ్‌ జోన్‌ కింద క్రషర్‌ మిషన్లు బిగించడంలో స్థానిక నేతల హస్తం ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంకర మిషన్ల ద్వారా వచ్చే ఆదాయం కోసమే ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని ఆరోపించారు. క్రషర్ల బిగింపు కారణంగా వంద మంది పేద రైతులు వీధిన పడుతుంటే పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కంకర మిషన్లు బిగించొద్దని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు అధికారులకు, బోర్డ్‌ ఆఫ్‌ బయోడైవర్సిటీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కంకర మిషన్లు బిగిస్తే 50కుటుంబాల వరకు మత్స్యకారులు కూడా ఉపాధి కోల్పోతారని గ్రామస్థులు విలేకరులతో చెప్పారు. కాగా ఇదే విషయమై తహసీల్దారు సుచరితను వివరణ కోరగా.. తాను దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 



Updated Date - 2022-07-02T05:09:32+05:30 IST