సున్నంపై.. కన్ను!

ABN , First Publish Date - 2022-08-20T05:43:43+05:30 IST

అనుమతులు గోరంత, తవ్వేది కొండంతలా నారాయణపురంలో గత మూడేళ్లుగా అధికార పార్టీ నేతలో అక్రమ మైనింగ్‌ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే కోటీశ్వరులు అయ్యేందుకు కొందరు మైనింగ్‌ వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు

సున్నంపై.. కన్ను!
నారాయణపురంలోని మైనింగ్‌ ప్రాంతం


నేతల జేబులు నింపుతున్న అక్రమ మైనింగ్‌

ఆధిపత్యం కోసం అధికార పార్టీ నేత ఆరాటం

ఈ క్రమంలోనే పరస్పర దాడులు 

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా..

నాడు అక్రమ మైనింగ్‌ అంటూ నానాయాగీ.

నేడు అదే మైనింగ్‌ కోసం రచ్చ.. రచ్చ..



అక్రమ మైనింగ్‌ నేతల జేబులు నింపుతోంది.. తక్కువ వ్యవధిలోనే కోటీశ్వరులు అయ్యేందుకు కొందరు మైనింగ్‌ వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడు ప్రాంతంలో అపార సున్నపు ఖనిజ నిక్షేపాలను ఆ పార్టీ నేతలే దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా టిప్పర్ల కొద్దీ సున్నపు, ముగ్గురాయిని తరలించేస్తున్నారు. ఇప్పుడు దానిపై పెత్తనం చెలాయించే క్రమంలో పరస్పర దాడులకు కూడా దిగుతున్నారు. 


  

దాచేపల్లి, ఆగస్టు19:  అనుమతులు గోరంత, తవ్వేది కొండంతలా నారాయణపురంలో గత మూడేళ్లుగా అధికార పార్టీ నేతలో అక్రమ మైనింగ్‌ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే కోటీశ్వరులు అయ్యేందుకు కొందరు మైనింగ్‌ వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి గురజాల నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత అండదండలు పుష్కలంగా ఉండటంతో కొందరు యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ చేస్తున్నారు. ఆ ముఖ్యనేతకు తెలియకుండా ఒక్క రాయికూడా క్వారీ దాటి బయటకు రాదని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. 


అప్పుడలా.. ఇప్పుడిలా..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం వస్తే మరోలా మాట్లాడటం ఇప్పటి అధికారపార్టీ నాయకులకే చెల్లిందని పల్నాటి ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నాలుగేళ్ల కిందట ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు మాటమాటికీ పల్నాడులో అక్రమమైనింగ్‌ అంటూ నానా యాగీ చేసేవారు. వాస్తవానికి దాచేపల్లి, నారాయణపురం, మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న స్థానిక వడ్డెర సామాజిక వర్గం ఉపాధి కోసం ఊళ్లూళ్లు తిరిగేవారు. 2000 సంవత్సరం తరువాత అందుబాటులో ఉన్న క్వారీలను నమ్ముకొని జీవనం సాగిస్తుంటే ఓర్వలేని ఆనాటి ప్రతిపక్ష నేతలు అక్రమమైనింగ్‌ జరుగుతుందంటూ ఫిర్యాదులు చేస్తుండేవారు. విచారించిన అధికారులు వాస్తవాలు తెలుసుకుని జీవనం కోసమే కొందరు వడ్డెరులు మైనింగ్‌ పనులు చేస్తున్నారని తేల్చి చెప్పటంతో ఆనాటి ప్రతిపక్ష నేతల నోర్లు మూతపడ్డాయి. అధికారం వచ్చిన తర్వాత అప్పటి దాకా చాటుమాటుగా ముడిరాయిని తీసే వడ్డెరుల జీవనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ జీవన విధానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన కొందరి యువకులపై మారణాయుధాలతో విచాక్షణారహితంగా దాడిచేయటంతో ఒకరు మృతిచెందగా మరికొందరు మృత్యువుతో పోరాడారు. ఈ క్రమంలో జరిగిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నీలకంఠబాబు హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం  కలిగించింది. అక్రమ మైనిగ్‌లో ఆధిపత్యంకోసమే అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు అలా చేశారని ఆరోపణలున్నాయి.

  

మూడేళ్ల నుంచి యథేచ్ఛగా... 

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడు ప్రాంతంలో అపార సున్నపు ఖనిజ నిక్షేపాలను అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా టిప్పర్ల కొద్దీ సున్నపు, ముగ్గురాయిని తరలించేస్తున్నారు. అధికారంలోకి రాకముందు క్వారీలపై పెత్తనం అంతా బీసీలదేనని చెప్పుకొచ్చి ఇప్పుడేమో పార్టీనేతలకు మైనింగ్‌ కట్టబెట్టటం పట్ల పలువురు మండిపడుతున్నారు. పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై కోర్టు వరకు ఎక్కిన పిడుగురాళ్లకు చెందిన బీసీ సామాజికవర్గ నేతను ఆనాడు అంతా అభినందించారు. అధికారం వచ్చాక అందలమెక్కిస్తామన్నారు. ఇది చెప్పి మూడేళ్లయినా ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా మైనింగ్‌ వ్యవహారంలో వారి పెత్తనమే జరగటంతో పార్టీకోసం జెండాను పట్టిన బీసీ సామాజిక వర్గ నేతలు జరుగుతున్న వ్యవహారంపై బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 


అధికార పార్టీ నేతల జేబుల్లోకి..

 నారాయణపురం, నడికుడి క్వారీల నుంచి రోజుకు సుమారు వెయ్యి ట్రాక్టర్ల వరకు ముడిరాయి మిల్లులకు రవాణా జరుగుతుంది. నాలుగు టన్నుల సామర్థ్యం గల ఒక ట్రక్కు ముడిరాయి మిల్లుకు తరలించి డిమాండ్‌ను బట్టి రూ.2500నుంచి రూ.3వేలు చెల్లించేలా ముఖ్యనేత నిర్ణయించారు. దీనికి మిల్లుల యజమానులు తలొగ్గారు. నారాయణపురంలో సమీపంలో ఉన్న క్వారీల నుంచి అనధికారికంగా ముడిరాయి తరలిస్తూ రోజుకు రూ.30లక్షలకుపైగా వసూలు  చేస్తున్నారని సమాచారం. ఖర్చులు పోనూ మిగిలిన సొమ్మంతా అధికారపార్టీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. దాచేపల్లి, నడికుడి, నారాయణపురంలో ఉన్న ముగ్గుమిల్లులు కూడా వైసీపీ నేతల ఆధీనంలోనే ఉన్నాయని ఆరోపణలున్నాయి. కొంతమంది మిల్లుల యజమానులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు అధికారపార్టీ నేతలు కొందరు ఆ మిల్లులకు ముడిరాయిని సరఫరా చేయకపోవటంతో మూతబడ్డ పరిస్థితులు ఉన్నాయి. క్వారీల్లో ట్రాక్టర్లు, కూలీలను కూడా తమకు నచ్చిన వారినే పిలిపించుకుంటూ వడ్డెర వర్గీయుల జీవనాన్నే గండికొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వడ్డెర సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. దాచేపల్లి సమీపంలోని నడికుడిలో సుమారు 50కిపైగా మిల్లులుండగా వాటిల్లో కొన్ని ఇప్పటికే మూతపడిఉన్నాయి. 


ఆర్థిక లావాదేవీలతోనే పరస్పర దాడులు 

 నిన్నా మొన్నటివరకు అక్కడ అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌ పదవిలో ఉన్న మహిళా నేత చక్కబెడుతున్నారు. దీనిని ఓర్చుకోలేని అధికార పార్టీ నేతలు కొందరు ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది తెలుసుకున్న ఆమె కూడా గట్టిగానే ప్రతిఘటించటంతో గురువారం ఇరువర్గీయుల మధ్య వివాదం రోడ్డెక్కింది. మైనింగ్‌క్వారీలో వస్తున్న ఆదాయంపై పట్టు సాధించాలన్న తలంపుతోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైందని సమాచారం. 

Updated Date - 2022-08-20T05:43:43+05:30 IST