మిమ్స్‌ చైర్మన్‌ మూర్తిరాజు ఇకలేరు

ABN , First Publish Date - 2020-08-04T10:28:02+05:30 IST

విద్యా సంస్థల అధినేత, మిమ్స్‌ మెడికల్‌ కళాశాల చైర్మన్‌, ఆధ్యాత్మికవేత్త అల్లూరి మూర్తిరాజు (85) సోమవారం కన్నుమూశారు.

మిమ్స్‌ చైర్మన్‌ మూర్తిరాజు ఇకలేరు

విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

నెల్లిమర్లలో ముగిసిన అంత్యక్రియలు


నెల్లిమర్ల, ఆగస్టు 3: విద్యా సంస్థల అధినేత, మిమ్స్‌ మెడికల్‌ కళాశాల చైర్మన్‌, ఆధ్యాత్మికవేత్త అల్లూరి మూర్తిరాజు (85) సోమవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో గత కొద్ది రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామానికి చెందిన మార్తిరాజుకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో భార్య, ఓ కుమార్తె గతంలో కన్నుమూశారు.పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. మూర్తిరాజు మరణంతో మిమ్స్‌ మూగబోయింది. ఆసుపత్రి, కళాశాలల్లో విషాదం నెలకొంది. విషయం తెలిసిన ప్రొఫెసర్లు, ఉద్యోగులు, సిబ్బంది దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జిల్లాలోనే తొలి ప్రైవేటు మెడికల్‌ కళాశాలను స్థాపించిన ఘనత మూర్తిరాజుది. 1935లో ఉగాది రోజున పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలం వలిమర్రు గ్రామంలో సోమరాజు, సూరమ్మ దంపతులకు ఆయన మూడో సంతానంగా జన్మించారు. 


భక్తి భావం కలిగిన అల్లూరి మూర్తిరాజు 2003లో రామతీర్థంలోని శ్రీరాముడి చెంత తన సేవా కార్యక్రమాల్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 2003లో శ్రీరామా ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నెల్లిమర్లలో మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (మిమ్స్‌) పేరుతో వైద్య కళాశాలను ప్రారంభించారు. దీంతో పాటు మిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. ఈ కళాశాలలో ఎంబీబీఎస్‌తో పాటు పీజీ, పారామెడికల్‌ కోర్సులను ఏర్పాటుచేశారు. వీటితో పాటు ఫిజియోథెరపీ, హోమియోపతి, నర్సింగ్‌ కాలేజ్‌, నర్సింగ్‌ స్కూల్‌ వంటి వాటిని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో మిమ్స్‌ ఆసుపత్రి ఏర్పాటు చేసిన అనంతరం దాదాపు వెయ్యికి పైగా ఉచిత వైద్యశిబిరాలను గ్రామాల్లో నిర్వహించారు. సంస్థ ద్వారా అనేక మంది నిరుద్యోగులు ఉపాధి పొందారు. ప్రస్తుతం 750 పడకల ఆసుపత్రిగా రోగులకు నిరంతర సేవలను అందిస్తున్నారు.


అత్యాధునికమైన పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. కేవలం నెల్లిమర్ల మిమ్స్‌ వైద్య కళాశాలే కాకుండా వరంగల్‌లో ఇంజినీరింగ్‌ కళాశాలను, విశాఖపట్నం , అరుకు ప్రాంతాల్లో పబ్లిక్‌ స్కూల్క్‌ను ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా శ్రీరామ భక్తుడైన మూర్తిరాజు భద్రాచలం శ్రీరామస్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా సుమారు 10 సంవత్సరాలు వ్యవహరించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అలాగే భద్రాచలం దేవస్థానం నిర్మాణ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. నెల్లిమర్ల మిమ్స్‌ను ఇంత కాలం మూర్తిరాజు పర్యవేక్షణలో ఆయన కుమారుడు సత్యనారాయణ నడిపిస్తున్నారు. మూర్తి రాజు మరణం పట్ల ట్రస్టు సభ్యులు డాక్టర్‌ ప్రవీణ్‌వర్మ, రామకృష్ణరాజు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘురామ్‌, ఏవో గణేష్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఆరిపాక శ్రీనివాసరావు, యూనియన్‌ నాయకులు టీవీ రమణ, కెంగువ మధుసూదనరావు తదితరులు నివాళి అర్పించారు. 


మిమ్స్‌ క్యాంపస్‌లోనే అంత్యక్రియలు

మూర్తిరాజు భౌతిక కాయానికి మిమ్స్‌ క్యాంపస్‌కు సమీపంలోని సొంత పొలంలొనే సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబీకులతో పాటు అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు.


తెప్పోత్సవానికి ఆయనే శ్రీకారం

భద్రాచలం దేవస్థానం అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మూర్తిరాజు దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా పనిచేసిన సమయంలో టీటీడీ, అన్నవరం, యాదగిరి గుట్ట దేవస్థానాల నుంచి నిధులను తీసుకొచ్చి భక్తులకు వసతి సదుపాయాలు సమకూర్చారు. తానే సొంతంగా అల్లూరి నిలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఆ భవనాన్ని మళ్లీ కూల్చివేసి రూ.80లక్షలతో ఇటీవల తిరిగి నిర్మించారు. భద్రాద్రి రామయ్యకు ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాల తరువాత వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ప్రముఖంగా నిర్వహిస్తారు.


అలాంటి ఉత్సవాల్లో మొట్టమొదటిసారిగా తెప్పోత్సవాన్ని ప్రవేశపెట్టి, హైదరాబాద్‌ సారథి స్టూడియా వారి సహకారంతో హంసాలంకృత వాహన సెట్టింగ్‌ వేయించి.. తొలిసారి తెప్పోత్సవాన్ని నిర్వహించింది అల్లూరి మూర్తిరాజే. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వాగ్గేయకారోత్సవాలకు కూడా ఆయనే నాంది పలికారు. ఆనాడు  ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంగీత విధ్వాంసులు పండిత హరిప్రసాద్‌ చౌరాస్యా, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, డా.ఎల్లా వెంకటేశ్వరరావు, శోభరాజ్‌ తదితర ప్రముఖ సంగీత కళాకారులను భద్రాచలానికి రప్పించి వారితో వాగ్గేయకారోత్సవాల్లో ప్రదర్శనలు ఇప్పించిన ఘనత మూర్తిరాజుదే. 

Updated Date - 2020-08-04T10:28:02+05:30 IST