ఎండమావిగా ఉద్యాన పంటల సబ్సిడీ

ABN , First Publish Date - 2021-09-28T05:30:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలు(పండ్లు, పూల తోటలు) సాగు చేసిన రైతులకు మూడేళ్లుగా సబ్సిడీ అందించలేదు.

ఎండమావిగా ఉద్యాన పంటల సబ్సిడీ
సాగు చేసిన అరటి పంట

  1. నంద్యాల డివిజన్‌లో ఎదురు చూస్తున్న రైతులు 


  రుద్రవరం, సెప్టెంబరు 28: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలు(పండ్లు, పూల తోటలు) సాగు చేసిన రైతులకు మూడేళ్లుగా సబ్సిడీ అందించలేదు. అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని ఉద్యానశాఖ అధికారులు చెప్పడం, రైతులు ఎదురు చూడటం తప్ప ఫలితం కనిపించడం లేదు.  సబ్సిడీ అందితే పెట్టుబడికి ఆసరాగా నిలుస్తుందనే రైతుల ఆశ అడియాశ అయింది.  


సబ్సిడీ అందించే ఉద్యాన పంటలు ఇలా.. 

ఉద్యానశాఖ సబ్సిడీ అరటి, బొప్పాయి, దానిమ్మ, చీని, నిమ్మ, మామిడి తోటలతో పాటు చామంతి, బంతి, మల్లెపూల తోటలకు వర్తిస్తుంది. కానీ మూడేళ్లుగా   సబ్సిడీ రైతుల ఖాతాలో జమ కాలేదు. నంద్యాల డివిజన్‌లో 2018 నుంచి 2021 వరకు రైతులకు అందాల్సిన సబ్సిడీ వివరాలిలా ఉన్నాయి.


 సమగ్ర జాతీయ ఉద్యాన మిషన్‌ పథకం    

సంవత్సరం   రైతుల సంఖ్య         సబ్సిడీ మొత్తం 

2018-19       455       రూ.1,36,59,757

2019-20      1,408               రూ.2,11,97,158

2020-21      1,039                 రూ.1,44,86,066


 రాష్ట్ర ప్రణాళిక 

సంవత్సరం   రైతుల సంఖ్య          సబ్సిడీ మొత్తం 

2018-19       1,697                 రూ.66,51,944

2019-20     2,344                        రూ.1,20,13,000


 రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన 

సంవత్సరం   రైతుల సంఖ్య           సబ్సిడీ మొత్తం 

2018-19     935                    రూ.31,50,957 

2019-20     1,881                   రూ.23,93,355 

2020-21     220                    రూ.5,59,006

ఇంత మొత్తంలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ పెండింగ్‌లో ఉంది. 


మూడేళ్లుగా ఎదురు చూస్తున్న..

బొప్పాయి పంట 5 ఎకరాల్లో సాగు చేశా. మూడేళ్లుగా సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నా. గత ప్రభుత్వాలు పండ్ల తోటలు సాగు చేసే రైతులకు సబ్సిడీ అందించేవి.  కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు  ఇవ్వలేదు. 

- గురుప్రసాదు, రైతు, ఆలమూరు  


సబ్సిడీ అందలేదు

సబ్సిడీ మూడేళ్లుగా అందలేదు. బొప్పాయి పంట మూడున్నర ఎకరాల్లో సాగు చేశా. సబ్సిడీ వస్తుందని అధికారులు చెబుతున్నారే తప్ప ఇంతవరకు అందలేదు.  

-  చంద్రశేఖర్‌, రైతు, ఆలమూరు 


నివేదికలు పంపించాం

పండ్ల తోటల  సాగు  వివరాలతోపాటు రైతులకు అందాల్సిన సబ్సిడీ వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ చేస్తుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. 

- శ్రీధర్‌, ఉద్యానశాఖ అధికారి



Updated Date - 2021-09-28T05:30:00+05:30 IST