Abn logo
Nov 29 2020 @ 01:15AM

ఎంఐఎం నుంచి ఐదుగురు ముస్లిమేతరులు

గతంలోనూ ఇతర వర్గాలవారికి టికెట్లు 

మేయర్‌గా ఆరుసార్లు.. 

మూడుసార్లు హిందువులే పీఠంపై 

బీజేపీ నుంచి ఓ ముస్లిం పోటీ 

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న మొత్తం 51 డివిజన్లలో ఐదు చోట్ల ముస్లిమేతరులు పోటీలో ఉన్నారు. గతంలోనూ ఆ పార్టీ అభ్యర్థుల్లో కనీసం ఐదుగురు ఇతర వర్గాలకు చెందిన వారికి టికెట్లు కేటాయిస్తోంది. మొత్తం ఆరుసార్లు మజ్లిస్‌ పార్టీకి నగర మేయర్‌ పీఠం దక్కగా, అందులో మూడుసార్లు ముస్లిమేతరులకు అవకాశం కల్పించింది. వారిలో కె. ప్రకాశరావు, అనుమోలు సత్యనారాయణ, ఆలంపల్లి పోచయ్య ఉన్నారు. 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించగా, ఐదుగురు ముస్లిమేతరులు ఉన్నారు. బీజేపీ కూడా ఓ డివిజన్‌ నుంచి ముస్లిం అభ్యర్థికి టికెట్‌ కేటాయించింది.

 ఫలక్‌ నుమా డివిజన్‌ నుంచి ఎంఐఎం తరఫున ఇదే పార్టీకి చెందిన సిట్టింగ్‌ కార్పొరేటర్‌ కె. తారాబాయి పోటీ చేస్తున్నారు. 

 పురానాపుల్‌ నుంచి సిట్టింగ్‌ కార్పొరేటర్‌ సున్నం రాజ్‌మోహన్‌ పోటీ చేస్తున్నారు.  

 కార్వాన్‌ డివిజన్‌ నుంచి మందగిరి స్వామి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇది ఎంఐఎం సిట్టింగ్‌ స్థానం. ఇక్కడ రాజేందర్‌ యాదవ్‌ విజయం సాధించారు.  

 జాంబాగ్‌ డివిజన్‌ నుంచి జడల రవీంద్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎంఐఎం తరఫున డి. మోహన్‌ గెలుపొందారు.  

 రంగారెడ్డి నగర్‌ నుంచి సిటింగ్‌ కార్పొరేటర్‌ ఈ. రాజేశ్‌గౌడ్‌ మజ్లిస్‌ తరఫున మరోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ తరఫున డబీర్‌పురా డివిజన్‌ నుంచి ముస్లిం అభ్యర్థి మిర్జా అఖిల్‌ అఫండి బరిలో ఉన్నారు.

Advertisement
Advertisement