ఎంఐజీకి స్పందన నిల్‌

ABN , First Publish Date - 2022-07-05T07:05:55+05:30 IST

విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఎంఐజీ ప్లాట్ల విక్రయంలో రూటు మార్చింది.

ఎంఐజీకి స్పందన నిల్‌

రూటు మార్చిన వీఎంఆర్‌డీఏ

ప్లాట్లకు గడువు తొలగింపు

ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునంటున్న అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఎంఐజీ ప్లాట్ల విక్రయంలో రూటు మార్చింది. మధ్య తరగతి ప్రజలకు మార్కెట్‌ ధర కంటే తక్కువకు ఇస్తామంటూ ఆనందపురం మండలం పాలవలస, రామవరం, గంగసానిఅగ్రహారాల్లోని నాలుగు లేఅవుట్లలో మొత్తం 2,310 ప్లాట్లు అమ్మకానికి పెట్టింది. మే నెలలో ఒకసారి, జూన్‌ నెలలో మరోసారి ప్రకటనలు జారీచేసింది. నెల రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని గడువు పెట్టింది. మొదటి నెలలో పెద్దగా స్పందన కనిపించలేదు. దాంతో మరో నెల గడువు ఇచ్చారు. అప్పుడు కూడా అదే జరిగింది. మొత్తంగా చూసుకుంటే 310 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఆది నుంచి వీటిపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 


కారణాలు

ఈ భూములు ప్రభుత్వానివి కావు. రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకున్నవి. అలాగే లేఅవుట్లు అని ప్రకటించారే తప్ప అక్కడ కనీసం మార్కింగ్‌ కూడా చేయలేదు. విమర్శలు వస్తున్నాయని, గత నెలాఖరులో ఆ భూముల్లో తుప్పలు కొట్టించారు. లేఅవుట్‌ రూపమే ఏర్పడలేదు. అదేవిధంగా మార్కెట్‌ ధర కంటే తక్కువ రేటు అని చెప్పి...అక్కడ ప్రైవేటు సంస్థలు అమ్ముతున్న దాని కంటే ఎక్కువ ధర పెట్టారు. ఈ కారణాలతో లక్షల రూపాయలు పెట్టి ప్లాట్లు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.  


ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు

లక్ష్మణరెడ్డి, ఎస్టేట్‌ ఆఫీసర్‌, వీఎంఆర్‌డీఏ

ఎంఐజీ లేఅవుట్లకు సమీకరించిన భూమిలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేశాము. లేఅవుట్లు వేయాల్సి ఉంది. మౌలిక వసతులు కల్పించడానికి త్వరలో టెండర్లు పిలుస్తాము. ఆసక్తి కలిగిన వారు అక్కడ భూములు పరిశీలించుకోవచ్చు. అందుకే గడువు ఏమీ నిర్ణయించలేదు. ఎవరికి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకే నిర్ణీత సమయం అని ఏమీ పెట్టలేదు. 

Updated Date - 2022-07-05T07:05:55+05:30 IST