అర్ధరాత్రి హాహాకారాలు

ABN , First Publish Date - 2022-07-04T06:20:13+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగగా, పార్శిల్‌ బోగీ పాక్షికంగా దగ్ధమైంది.

అర్ధరాత్రి హాహాకారాలు
రైలు బోగీలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది

 దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పార్శిల్‌ బోగీలో మంటలు 

 ఘట్‌కేసర్‌, బీబీనగర్‌ స్టేషన్‌మాస్టర్ల సమాచారంతో రైలు నిలిపివేత 

విలువైన సామగ్రి దగ్ధం

బీబీనగర్‌, జూలై 3: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగగా, పార్శిల్‌ బోగీ పాక్షికంగా దగ్ధమైంది. ప్రయాణికులు ఉన్న బోగీలకు మంటలు అంటుకోకపోవడంతో ప్రాణనష్టం తప్పగా విలువైన వస్తు సామగ్రి అగ్నికి ఆహుతైంది. బీబీనగర్‌-పగిడిపల్లి స్టేషన్ల మార్గమధ్యలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.  రైల్వే పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం రాత్రి 11.40నిమిషాలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. మార్గమధ్యలో రైలు చివరన ఉన్న పార్శిల్‌ బోగీలోనుంచి పొగలు ఎగిసిపడుతుండగా ఘట్‌కేసర్‌ స్టేషన్‌మాస్టర్‌, అక్కడి సిబ్బంది గుర్తించి బీబీనగర్‌ స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఘట్‌కేసర్‌, బీబీనగర్‌లో స్టాప్‌ లేకపోవడంతో ఇక్కడ ఆపలేకపోయారు. రైలు బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ చేరుకునే సరికి పార్శిల్‌ బోగీలో మంటల తీవ్రత ఎక్కువైంది. దీంతో దిగువనున్న బీబీనగర్‌ మండలం పగిడిపల్లి స్టేషన్‌ మాస్టర్‌కు ప్రమాద విషయాన్ని తెలియజేశారు. అక్కడి స్టేషన్‌ మాస్టర్‌ రాజే్‌షకుమార్‌ అప్రమత్తమై రైలును 12.32 నిమిషాలకు పగిడిపల్లి క్రాసింగ్‌ వద్ద నిలిపివేయించారు. క్రాసింగ్‌ వద్ద నిలిపివేయడంతో అటుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రైలుకు అగ్నిప్రమాద విషయాన్ని వెంటనే స్టేషన్‌ మాస్టర్‌ ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులతోపాటు పోలీసులు, రైల్వే సిబ్బంది సుమారు 200 మంది సహాయక చర్యల్లో పాల్గొని రైలు నుంచి మంటలు ఎగిసిపడుతున్న పార్శిల్‌ బోగీని వేరుచేశారు. వేరు చేసిన ప్యాసింజర్లు ఉన్న మిగతా బోగీలతో కూడిన రైలు రాత్రి ఒంటిగంటకు ఢిల్లీకి బయలుదేరింది. వెంటనే సమీప ప్రాంతాల నుంచి ఐదు ఫైర్‌ ఇంజన్లను రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ, మంటలు అదుపులోకి రాలేదు. అప్పటికే విలువైన వస్తు సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. కొద్దిసేపటికి అత్యవసర విభాగం ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్‌ ఇంజన్లతో ఓ వైపు మంటలను అర్పుతూ మరోవైపు రెస్క్యూ టీం నేతృత్వంలో ఎక్స్‌కవేటర్‌ సహాయంతో బోగీలో దగ్దమైన సామగ్రిని బయటకు తీశారు. ఆదివారం ఉదయం 11గంటల వరకు రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మంటలను ఆర్పేశారు.


ఘటనా స్థలాన్ని పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

ప్రమాద ఘటనను తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌, డీఆర్‌ఎం ఏకే గుప్తా తదితర ఉన్నతాధికారుల బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. మంటలు చెలరేగిన బోగీని, దగ్ధమైన సామగ్రిని పరిశీలించారు. వివిధ విభాగాల నిపుణులతో కలిసి దగ్ధమైన బోగిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతీ బోగీకి ఉండే డీవోటీలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగి ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. దగ్ధమైన వస్తువుల విలువ ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, ఇందులో ఎక్కువగా అమెజాన్‌ కంపెనీ సామగ్రి ఉందని, పూర్తి విచారణ తరువాత కారణాలు చెబుతామన్నారు. కాగా రైలు బోగీలలోని మంటలను ఆర్పేసి ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు దగ్ధమైన బోగిలను ఘటనా స్థలం నుంచి తరలించారు. 


ఏ సమయంలో.. ఏం జరుగుతుందో

అర్ధరాత్రి వేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో రైలు ఒక్కసారిగా ఆగిపోవటంతో ప్రయాణికులు బోగీ బయటకు వచ్చి చూడగా వెనుక మంటలు కనిపించడంతో భయకంపితులయ్యారు. రైలు బోగీలలోని వారికి సమాచారమివ్వటంతో అందరూ అప్రమత్తమయ్యారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ప్రయాణికులు యాతనపడ్డారు. ప్రమాదం కేవలం పార్శిల్‌ బోగీల వరకే అని తేలడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దగ్ధమైన బోగీని వేరుచేసి, మిగతా బోగీలను అక్కడి నుంచి పంపించడంతో ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు పేర్కొన్నారు.  

Updated Date - 2022-07-04T06:20:13+05:30 IST