హత్రాస్‌ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-10-01T08:50:30+05:30 IST

మృతురాలి కుటుంబ సభ్యులను ఇళ్లలో పోలీసులు నిర్బంధించి అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో మృతదేహాన్ని దహనం చేశారు...

హత్రాస్‌ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు

  • కుటుంబ సభ్యుల నిర్బంధం.. మృతదేహం దహనం
  • యోగి సర్కారుపై వెల్లువెత్తుతున్న నిరసనలు
  • ఆత్మరక్షణలో బీజేపీ.. యోగికి ప్రధాని మోదీ ఫోన్‌
  • సిట్‌ ఏర్పాటు.. కుటుంబానికి 25 లక్షల పరిహారం: యోగి


హత్రా్‌స/లఖ్‌నవ్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: ఉత్తరప్రదేశ్‌లోని హత్రా్‌సలో దళిత యువతి(19) సామూహిక అత్యాచారానికి గురై.. మృతి చెందిన ఘటనపై ఓవైపు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతుండగా.. ఆమె మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఇళ్లలో నిర్బంధించి అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో మృతదేహాన్ని దహనం చేశారు. బాధితురాలు ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున చనిపోగా.. అర్ధరాత్రి స్వగ్రామానికి తరలించారు. మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరగా.. పోలీసులు అంగీకరించలేదు. తమందరినీ ఇంట్లో పెట్టి.. తాళం వేసి మృతదేహాన్ని తరలించారని, తమ తండ్రిని బలవంతంగా తీసుకెళ్లారని మృతురాలి సోదరుడు, సోదరి తెలిపారు. పోలీసుల ఈ చర్య పట్ల తీవ్ర రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని యూపీ భవన్‌ ఎదుట కాంగ్రెస్‌, లెఫ్ట్‌ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. లఖ్‌నవ్‌లో కాంగ్రెస్‌, భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు సీఎం యోగి నివాసం ముట్టడికి యత్నించారు. కాగా, మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ నుంచి హత్రా్‌సకు బయల్దేరిన భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, హిమాన్షు బాల్మిక్‌లను పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. తనను సహరాన్‌పూర్‌లో హౌస్‌ అరెస్టు చేశారని ఆజాద్‌ ట్విటర్‌లో తెలిపారు.


క్రూరమైన సర్కారు చేసిన హత్య: సోనియా

హత్రాస్‌ బాధితురాలి మృతి.. క్రూరమైన సర్కారు చేసిన హత్య అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ఇది మొత్తం సమాజానికే కళంకమన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి యోగి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు స్వయంగా ఈ కేసును పరిశీలనలోకి తీసుకొని విచారించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి కోరారు. అత్యాచారానికి సంబంధించి ఆధారాలు లేకుండా చేసేందుకే అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఈ ఘటనను కులోన్మాదంతో కూడిన అత్యాచారంగా సీపీఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. మృగాల చేతిలో తొలుత యువతి అత్యాచారానికి గురైందని, ఇప్పుడు మొత్తం వ్యవస్థ అత్యాచారానికి గురైందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దళిత యువతిని మొదటినుంచీ అవమానించిన పోలీసులు మరణంలోనూ ఆమెను ఆగౌరవపరిచారంటూ అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి కవితా కృష్ణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని యూపీ పోలీసులను జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఆదేశించారు. మరోవైపు అత్యాచార ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టి్‌సకు ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ లేఖ రాశారు. కాగా, ఓ సినీనటి (కంగనా రనౌత్‌) ఇల్లు కూలగొట్టారని గగ్గోలు పెట్టిన వారంతా ఇప్పుడు దళిత యువతికి న్యాయం కావాలని ఎందుకు కోరడంలేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రియాంకరెడ్డి హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లే.. హత్రాస్‌ నిందితులను కూడా చేయాలని కంగన అన్నారు.  


నిందితులను కఠినంగా శిక్షిస్తాం: యోగి

హత్రాస్‌ ఘటనతో వెల్లువెత్తుతున్న నిరసనలతో అధికార బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని యోగి స్వయంగా వెల్లడించారు. అత్యాచార ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారిస్తామన్నారు.  బుధవారం ఆయన మృతురాలి తండ్రితోనూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు  ఇస్తామని యోగి ప్రకటించినట్లు సీఎంవో పేర్కొంది. కాగా, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Updated Date - 2020-10-01T08:50:30+05:30 IST