భూగర్భంలో అద్భుతం

ABN , First Publish Date - 2022-04-12T17:42:53+05:30 IST

వంతెనల నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తమైన చోట ప్రత్యామ్నాయంగా భారీ సొరంగ మార్గం నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ కసరత్తు చేపట్టింది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు

భూగర్భంలో అద్భుతం

మహా నగర రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఐటీ కారిడార్‌ మొదలు కేబుల్‌, పాదచారుల వంతెనలు, అండర్‌పాస్‌ 

నిర్మాణాలు జోరందుకున్నాయి. మరో అద్భుతం ఆవిష్కృతమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. 


కేబీఆర్‌ పార్కు కింద సొరంగ మార్గం

నాలుగు లేన్లు.. 6.30 కి.మీలలో నిర్మాణానికి సన్నాహాలు

రోడ్‌ నెంబర్‌-45 నుంచి ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ జంక్షన్‌ వరకు..

రూ.5 వేల కోట్లకుపైగా అంచనా వ్యయం

మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు మరో మార్గం

భూగర్భంలో వేర్వేరు రోడ్లు

సాధ్యాసాధ్యాల పరిశీలనకు టెండర్‌

ప్రీ బిడ్‌ సమావేశంలో పాల్గొన్న మూడు సంస్థలు


హైదరాబాద్‌ సిటీ: వంతెనల నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తమైన చోట ప్రత్యామ్నాయంగా భారీ సొరంగ మార్గం నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ కసరత్తు చేపట్టింది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్‌) కింద నుంచి దేశంలోనే రెండో అతి పెద్ద సొరంగ మార్గం(టన్నెల్‌) నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు సులువైన రాకపోకల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్నారు. దుర్గం చెరువుపై కేబుల్‌ వంతెనకు కొనసాగింపుగా టన్నెల్‌ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. నిర్మాణ సాధ్యాసాధ్యాల పరిశీలనకు జీహెచ్‌ఎంసీ ఇటీవల టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. ప్రీ బిడ్‌ సమావేశానికి మూడు సంస్థలు హాజరయ్యాయని ఓ అధికారి చెప్పారు. మే 2 వరకు బిడ్‌ దాఖలు చేసే అవకాశముంది. 


మంత్రి సూచన మేరకు..

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ)లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వంతెనలు, అండర్‌పా్‌సలు నిర్మిస్తున్నారు. రూ.6 వేల కోట్ల పనులు ప్రారంభించగా రూ.4 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.2 వేల కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండో దశలో భాగంగా రూ.3,115 కోట్లతో మరిన్ని ప్రాంతాల్లో వంతెనలు, సొరంగ మార్గాలు, కారిడార్లు అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలోనే ఐటీ కారిడార్‌ కోర్‌ సిటీకి అనుసంధానంగా ఉన్న కేబీర్‌ పార్క్‌ చుట్టూ వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఎన్‌జీటీ అభ్యంతరంతో పక్కన పెట్టారు. నాలుగు జంక్షన్లలో అయినా ప్రాజెక్టులు చేపట్టాలని భావించినా కార్యరూపం దాల్చలేదు. జాతీయ గుర్తింపు ఉన్న పార్కులో జీవ వైవిధ్యం దెబ్బతినడంతో పాటు.. వేలాది చెట్లు తొలగించాల్సి వస్తుందన్న కారణాలతో ఎన్‌జీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు కేబీఆర్‌ పార్కు భూగర్భం నుంచి టన్నెల్‌ నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్‌ ప్రకటన వెలువడింది. 


పార్కుపై ప్రభావం పడకుండా..

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-45 నుంచి కేబీఆర్‌ పార్కు, అక్కడి నుంచి మహరాజ్‌ అగ్రసేన్‌ చౌరస్తా, బంజారాహిల్స్‌ వైపు ముఫకంజా కాలేజీ వరకు సొరంగ మార్గాలు నిర్మించాలని భావిస్తున్నారు. మొత్తం 6.3 కి.మీల మేర నాలుగు లేన్లుగా (ఒక్కో వైపు రెండు) రహదారుల నిర్మాణం చేపట్టాలన్నది అధికారుల ఆలోచన. ఇందుకు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చవుతాయని సూత్రప్రాయ అంచనా వేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక అనంతరం నిర్మాణ వ్యయంపై స్పష్టత వస్తుందని ఉన్నతాధికారొకరు చెప్పారు. జాతీయ పార్కు కేబీఆర్‌లోని చెట్లకు, ఇతర జీవరాశులకు ఇబ్బంది కలగకుండా 100 అడుగుల లోతున (30 మీటర్లు) టన్నెల్‌ నిర్మించాలన్నది ప్రణాళిక. ప్రతిపాదిత మార్గాల్లోని కొన్ని నిర్మాణాల కింద నుంచీ టన్నెల్‌ వెళ్లే అవకాశాలున్నాయి. వంతెనలతో పోలిస్తే టన్నెల్‌కు ఏడెనిమిది రెట్ల అదనపు ఖర్చవుతుంది. సొరంగ మార్గాలు ప్రస్తుత రహదారులను కలిసే చోట అప్రోచ్‌ రోడ్ల కోసం ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది. 


ఎన్నో ప్రశ్నలు..

కేబీఆర్‌ పార్కు కింది నుంచి టన్నెల్‌ నిర్మాణానికి అవకాశం ఉంటుందా, 100 అడుగుల లోతులో ప్రతిపాదిస్తే చెట్లు, ఇతర నిర్మాణాలపై ప్రభావం ఉండదా, ఇళ్ల కింది నుంచి సొరంగ మార్గం వెళ్లేందుకు స్థానికులు అంగీకరిస్తారా, వారికి పరిహారం ఇవ్వాలా, భూమిలో ఎంత లోతు వరకు యజమానికి హక్కు ఉంటుంది..? జూబ్లీహిల్స్‌లో ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో నీటి కోసం వేల అడుగుల లోతు వరకు బోర్లు వేశారు. టన్నెల్‌ మార్గంలో బోర్లు ఉంటే ఏం చేయాలి, ప్రత్యామ్నాయాలేంటి.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికీ నివేదికలో పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. భూగర్భంలో చీకటి ఉండే సొరంగ మార్గానికి విద్యుత్‌ సరఫరా, వీలైనంత మేర వెంటిలేషన్‌ ఉండడం, వరద నీరు వెళ్లకుండా జాగ్రత్తలు, భూకంపాలను తట్టుకునేలా నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఏజెన్సీ సూచించనుంది. దక్కన్‌ పీఠభూమి హైదరాబాద్‌ భూగర్భంలో రాళ్లు ఎక్కువగా ఉంటాయి, ఈ నేపథ్యంలో టన్నెల్‌ నిర్మాణం ఎంత వకు సాధ్యం అన్నది పరిశీలించనున్నారు. ఖాజాగూడ గుట్టను తొలచి టన్నెల్‌ నిర్మించేందుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు రూపొందించారు. రూ.1000 కోట్లకుపైగా ఖర్చవుతుందన్న కారణంతో ప్రణాళికను పక్కన పెట్టారు. రెండో ఫేజ్‌లో భాగంగా సర్కారుకు పంపగా, ఉన్నత స్థాయిలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ముందడుగు పడనుంది. ఈ నేపథ్యంలో కేబీఆర్‌ పార్కు కింద టన్నెల్‌ నిర్మాణం సాధ్యమా, ప్రభుత్వం ఆ స్థాయిలో నిధులు కేటాయిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. సొరంగ మార్గం నిర్మించిన పక్షంలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు, సొరంగ మార్గం గుండా రోడ్‌ నెంబర్‌-45, దుర్గం చెరువు కేబుల్‌ వంతెనల మీదుగా వెళ్తాయని అధికారులు చెబుతున్నారు. 


సొరంగ మార్గాలిలా.. (కి.మీలలో)

 రోడ్‌ నెంబర్‌ 45 నుంచి కేబీఆర్‌ పార్కు ప్రవేశ 

ద్వారం వరకు నాలుగు లేన్లు (1.70)

 కేబీఆర్‌ ప్రవేశ ద్వారం నుంచి ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ జంక్షన్‌ (2.00)

రోడ్‌ నెంబర్‌ -12 టన్నెల్‌ జాయినింగ్‌ పాయింట్‌ (1.10)

అప్రోచ్‌ రోడ్లు (1.50)

Updated Date - 2022-04-12T17:42:53+05:30 IST