అప్పు చేసి పప్పన్నం..

ABN , First Publish Date - 2021-11-28T05:22:25+05:30 IST

ఆరు నెలలుగా మెస్‌ బిల్లులు రాకపోవడంతో ఏలూరులోని ఓ హాస్టల్‌ వార్డెన్‌ సొంత జీతం డబ్బులతో నిర్వహిస్తున్నాడు. ప్రతి నెలా తెచ్చే కిరాణా షాపులో అప్పు పెట్టి మరీ సరుకులు తెచ్చి పిల్లల కడుపు నింపుతున్నాడు

అప్పు చేసి పప్పన్నం..

హాస్టళ్లకు ఆరు నెలలుగా అందని మెస్‌ చార్జీలు

నిర్వహణ కోసం వార్డెన్ల తిప్పలు

పలుచోట్ల సొంత పూచీకత్తుపై సరుకులు

మరుగున పడిన కాస్మెటిక్‌ చార్జీలు


ఏలూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆరు నెలలుగా మెస్‌ బిల్లులు రాకపోవడంతో ఏలూరులోని ఓ హాస్టల్‌ వార్డెన్‌ సొంత జీతం డబ్బులతో నిర్వహిస్తున్నాడు. ప్రతి నెలా తెచ్చే కిరాణా షాపులో అప్పు పెట్టి మరీ సరుకులు తెచ్చి పిల్లల కడుపు నింపుతున్నాడు మరో వార్డెన్‌. కిరాణా షాపు నిర్వాహకుడు ప్రభుత్వాన్ని నమ్మి సరుకులు ఇవ్వనని మొరాయిస్తే, తానే తీరుస్తానని సొంత పూచీకత్తు రాసి సరుకులు తెచ్చుకుంటున్నాడు జంగారెడ్డిగూడెంలోని మరో వార్డెన్‌. ఇదీ జిల్లాలోని వసతి గృహాల్లోని వార్డెన్ల పరిస్థితి. జిల్లాలో మొత్తం 66 బీసీ సంక్షేమ వసతి గృహాలు, 11 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు వసతి పొందు తున్నారు. కరోనా సమయంలో మూతపడిన ఈ హాస్టళ్లు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెరిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 95 శాతం హాస్టళ్లకు మెస్‌ బిల్లులు రాలేదు. వీటి కారణంగా హాస్టళ్ల నిర్వహణ ఉద్యోగులకు కొత్త తలనొప్పులు తెస్తోంది. జిల్లాలో చాలా మంది సొంత డబ్బుతో విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారు. 60 మంది ఉండే హాస్టల్‌ నిర్వహణకు ఒక్కొక్కరికి రూ.1400 చొప్పున ప్రతి నెలా రూ.84 వేలు ఖర్చవుతోంది. ఈ ఖర్చును భరించలేని ఉద్యోగులు రోజువారీ సరుకులు ఇచ్చే షాపు నిర్వాహకుల వద్ద అప్పు పెడుతున్నారు. అప్పులు పెరిగి, ఇప్పట్లో మెస్‌ చార్జీలు వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో ఇటీవల సరుకులు ఇచ్చేందుకు షాపు నిర్వాహకులు నిరాకరిస్తున్న వార్డెన్లు చెబుతున్నారు. తమ వ్యక్తిగత పూచీకత్తుపై అప్పులు తెస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణం మెస్‌ బిల్లులు విడుదల చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన చెందుతున్నారు. 


మరిచిన.. కాస్మెటిక్‌ చార్జీలు !

విద్యార్థుల రోజువారీ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా ఇవ్వాల్సిన కాస్మెటిక్‌ చార్జీలను నిలిపివేసింది. వీటితోనే తమకు కావాల్సిన స్టేషనరీ కొనుక్కుంటారు. మూడు నుంచి ఆరో తరగతి విద్యార్థులకు రూ.100, బాలికలకు రూ.110,  ఏడో తరగతి బాలురకు రూ.125, బాలికలకు రూ.160 చొప్పున ప్రతి నెల కాస్మెటిక్‌ చార్జీలు ఇవ్వాలి. ఎనిమిది నుంచి ఇంటర్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు చదివే వారికి నెలకు రూ.125, విద్యార్థినులకు రూ.160 చొప్పున ఇవ్వాలి. బాలురు క్రాప్‌నకు ప్రతి నెలా అదనంగా రూ.30 చెల్లించాలి. ఏడాదిన్నరగా ఇవి ఇవ్వడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రోజువారీ అవసరాలకు, పరిశుభ్రతకు కీలకమైన ఇవి రాకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శన మని వాపోతున్నారు. ‘హాస్టల్‌ విద్యార్థులకు రావాల్సిన మెస్‌, కాస్మెటిక్‌ చార్జీలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. డబ్బులు రాకపోవడంతో విద్యార్థులకు కనీసం కడుపు నిండా తిండి దొరకని పరిస్థితి కనిపిస్తోంది. వార్డెన్లు తమ సొంత డబ్బుతో నిర్వహించాల్సి రావడంతో ప్రమాణాలు దిగజారు తున్నాయి’ అని పీడీఎస్‌యూ నేత కాకి నాని అన్నారు. 


మా దగ్గర పెండింగ్‌ లేదు

– నాగరాణి, హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారి

మా దగ్గర బిల్లులు పెండింగ్‌ లేవు. బిల్లులు పెండింగు లేకుండా మొత్తం బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని రాష్ట్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మన జిల్లాలో ఎలాంటి సమస్య లేదు. బడ్జెట్‌ కూడా ఉంది. సీఎఫ్‌ఎంఎస్‌ వద్ద జాప్యం జరిగి ఉంటుం దని అనుకుంటున్నాం. 



Updated Date - 2021-11-28T05:22:25+05:30 IST