రోడ్లపైనే వ్యాపారులు

ABN , First Publish Date - 2022-04-25T05:52:53+05:30 IST

కీసర ప్రధాన చౌరస్తా వీధి వ్యాపారులతో కిక్కిరుస్తోంది. రోడ్డుపైనే బండ్లు పెట్టడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది.

రోడ్లపైనే వ్యాపారులు
కీసర ప్రధాన చౌరస్తాలో రోడ్డుపై వ్యాపారాలు


  • ఇబ్బందుల్లో వాహనాదారులు, బాటసారులు
  • పట్టించుకోని అధికారులు, పాలకులు

కీసర ప్రధాన చౌరస్తా వీధి వ్యాపారులతో కిక్కిరుస్తోంది. రోడ్డుపైనే బండ్లు పెట్టడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది.  తోపుడు బండ్ల వ్యాపారాలతో భోగారం రోడ్డులో వాహనాదారులు, బాటసారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు బండ్ల వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు  ఆశపడి ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ప్రజలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కీసర, ఏప్రిల్‌ 24: టెంపుల్‌ టౌన్‌గా పేరుగాంచిన కీసర చౌరస్తా వ్యాపారులకు అడ్డాగా మారింది. దీంతో వాహనాదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పాలకులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రం కీసర చౌరస్తాను టెంపుల్‌ టౌన్‌గా తీర్చిదిద్దాలని జిల్లా మాజీ కలెక్టర్‌ ఎంవీరెడ్డి అధికారులను, పాలకులను గతంలో ఆదేశించారు. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన కీసరగుట్ట అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు చౌరస్తా అభివృద్ధి కోసం కృషిచేశారు.  అప్పట్లో కీసర ప్రధాన కూడలిలో ఉన్న తోపుడు బండ్లను, రోడ్లపై వ్యాపారాలు చేసే వారిని అప్పటీ సీఐ సురేందర్‌గౌడ్‌ భారీ బందోబస్తు మధ్య బండ్లను, చిరు వ్యాపారులను చౌరస్తా నుంచి పంపించారు. దీంతో కొంత కాలం చౌరస్తా కళకళలాడింది. ఎంవీ రెడ్డి బదిలీ తర్వాత కీసర ప్రధాన చౌరస్తా అభివృద్ధి మళ్లీ మొదటికొచ్చింది. 

దుకాణదారులపై వీధి వ్యాపారుల రుబాబు

నాయకుల అండదండలతో వ్యాపారులు చౌరస్తా వద్ద రోడ్డుపైనే బండ్లు పెట్టుకుంటున్నారు. వీరికి ఎలాంటి అనుమతులు లేవు. అడ్వాన్సులు కట్టాల్సిన పని లేదు. అద్దె కట్టాల్సిన అవసరం అసలే లేదు. ఇదేమని అడిగితే మా ఇష్టం.. అన్నట్టు వ్యాపారుల తీరు ఉంది. రోడ్డు పక్కన పూలు, పండ్లు, కూరగాయాలు విక్రయించే వారిపైనా వ్యాపారులు దురుసుగా ప్రవర్తిస్తారు. రోడ్డంతా తమదే అన్నట్టు బెదిరిస్తారు. రోజువారీ రూ.వేల వ్యాపారం చేస్తున్నారు. ప్రధాన చౌరస్తాలో షటర్‌ అడ్వాన్స్‌ లక్షల రూపాయాలు ఉంది. నెలనెలా అద్దె రూ.వేలల్లో ఉంటుంది. షట్టర్ల వ్యాపారులు పన్నులు కడుతున్నారు. బండ్లపై వ్యాపారం చేసే దుకాణాలు అడ్డుగా బండ్లు పెట్టి పెత్తనం చెలాయిస్తున్నారని దుకాణదారులు వాపోతున్నారు. పర్వదినాలు, పండుగల సమయంలో ఇక కీసర ప్రధాన చౌరస్తా కిక్కిరుస్తోంది. రోడ్డు మొత్తం మాదే అన్నట్టు వ్యాపారులు ప్రవర్తిస్తారు. దీంతో రోడ్డు మొత్తం ట్రాఫిక్‌తో స్థంభిస్తుంది. పండుగల సమయంలోనే కాదు.. సాధారణ సమయాల్లోనూ వీధి వ్యాపారులతో భోగారం రోడ్డులో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాహనాదారులు వాపోతున్నారు. ఓటు బ్యాంక్‌ రాజకీయ నాయకుల అండదండలు వ్యాపారులకు ఉన్నందునే కీసర చౌరస్తా అభివృద్ధికి నోచుకోవడం లేదని, వీధి వ్యాపారులిచ్చే మాముళ్లుకు అలవాటు పడి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలకు వెనుకంజ వేస్తున్నారని పట్టణవాసులు అంటున్నారు. వాహనాదారుల, బాటసారుల ఇబ్బందులను పట్టించుకొని కీసర ప్రధాన రోడ్లపై జరిపై వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపునకు కృషి చేస్తాం

గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో వ్యాపారుల కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించేందుకు కృషి చేస్తాం. భోగారం రోడ్డులో పొల్కం కట్ట వద్ద షటర్లు వేయాలనుకున్నాం. కానీ ప్రభుత్వ స్థలం రోడ్డుకు పోయిందని అధికారులు తెలిపారు. సర్వే రిపోర్టు అధికారులు మేం అడిగినా ఇవ్వడం లేదు. అదే విధంగా మార్కెట్‌ యార్డుకు స్థలం కేటాయించినా నిధులు లేక ఎలాంటి పనులు చేపట్టలేకపోతున్నాం. 

                                                                              - నాయకపు మాధురి, కీసర, సర్పంచ్‌

Updated Date - 2022-04-25T05:52:53+05:30 IST