సీజనల్‌ వ్యాధుల ముప్పు

ABN , First Publish Date - 2022-07-08T04:33:26+05:30 IST

వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు చెలరేగితే ప్రజలకు కష్టాలు మరింతగా పెరుగుతాయి. యేటా వానా కాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గు న్యా, మెదడువాపు, ఫైలేరియా, అతిసారం, టైఫాయిడ్‌, తదితర సీజనల్‌ వ్యాధులు గ్రామీణులను తీవ్రంగా వేధిస్తున్నాయి.

సీజనల్‌ వ్యాధుల ముప్పు
ఆసిఫాబాద్‌ ఆసుపత్రి

- ముసురు వానలతో పెరిగిన దోమల బెడద

- పారిశుధ్యంపై దృష్టిసారించాలని పంచాయతీలకు సూచన

-  మలేరియా విజృంభించే అవకాశముందంటున్న వైద్య, ఆరోగ్యశాఖ

యేటా వానాకాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెం గ్యూ, టైఫాయిడ్‌, న్యూమేనియా వంటి వ్యాధులు గ్రామీణులను తీవ్రంగా వేధిస్తున్నాయి. పరిశుభ్రత అందరి బాధ్యత అనే అవగాహనతో ముందుకు సాగితేనే అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి-ఆసిఫాబాద్‌)

వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు చెలరేగితే ప్రజలకు కష్టాలు మరింతగా పెరుగుతాయి. యేటా వానా కాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గు న్యా, మెదడువాపు, ఫైలేరియా, అతిసారం, టైఫాయిడ్‌, తదితర సీజనల్‌ వ్యాధులు గ్రామీణులను తీవ్రంగా వేధిస్తున్నాయి.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ధి చెందే అవకాశమున్నందున పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పంచాయతీ రాజ్‌, వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధిం చి ఇటీవల ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.  సీజనల్‌ వ్యాధులతో పాటు, కరో నా నియంత్రణ చర్యలను కూడా ఏకకాలంలో కొనసాగించాలని కలెక్టర్‌ వైద్య ఆరోగ్యశాఖల అధికారులకు సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీటిసంబదిత, కీటక సంబందిత వ్యాధులు ప్రబలుతున్నందున్న జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ ఆయా శాఖలను ఆదేశించారు. జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న సామాజిక, బౌగోళిక వైరుధ్యాల కారణంగా యేటా వానాకాలంలో అంటు వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు కూడా ప్రబలడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. మరీ ముఖ్యంగా కనుమరుగైపో యిందని భావించిన మలేరియా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్లు రాష్ట్ర వైధ్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. 

సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో..

ఈ నేపథ్యంలోనే కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాను మలేరియా సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో చేర్చి నియంత్రణ చర్యలు చేప ట్టాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక గణంకాల ప్రకారమే 60 మలేరియా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అనధికారంగా ఈ సంఖ్య నాలుగైదు రెట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.. జి ల్లా వ్యాప్తంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలతో బాదితులు మరణించినట్లు అధికారికంగా రికార్డు కాకపోయినా ఏజెన్సీలో ఎలాంటి డయాగ్నసిస్‌ చేయని కేసులే అధికంగా ఉన్నాయంటున్నారు. ఇందులో పదుల సంఖ్యలో బాదితులు మృత్యువాత పడ్డారని అంటున్నారు. కొంతకాలం క్రితం కౌటాల మండలానికి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యురాలితో పాటు మరో ఎంపీపీ బంధువు ప్లేట్‌లెట్‌ కౌంట్లు తగ్గిపోయి మృత్యువాత పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని లోతుగా విశ్లేషిస్తే వారు డెంగ్యూ లక్షణాలతోనే మృత్యువాత పడ్డారనే విషయం తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించామని చెబుతున్నా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో రహదారులు సరిగ్గా లేని కారణంగా సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి శాంపిల్స్‌ను సేకరించే పరిస్థితులు అంతంత మాత్రమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. దాంతో చాలా మంది జ్వరాల బారిన పడిన రోగులు అందుబాలులో ఉండే ఆర్‌ఎంపీలు, సాంప్రదాయ నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఏజెన్సీలో మలేరియా వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణ కోసం ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికే 71 వేల దోమ తెరలను పంపిణీ చేశారు.

జిల్లా వ్యాప్తంగా..

కుమరం భీం జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 114 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 26 మంది వైద్యులు, 156 మంది ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. కాగా ప్రధానంగా మౌలిక సదుపాయాలు వైద్య సేవల జారీలో ప్రధాన అడ్డంకిగా తయారయ్యాయి. దాంతో మారుమూల అటవీ గ్రామాల్లో ప్రతి సీజన్‌లో అంటువ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇప్పటికీ జిల్లాలో ఉన్న ప్రాథమిక, ఉప కేంద్రాల్లో సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ వారు కూడా సరిగ్గా విధులకు హాజరు కాక పోవడం వల్ల గిరిజనులకు వైద్యం అందని ద్రాక్ష గా మారుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. జిల్లాలో నెలకొన్న భౌగోళిక పరిస్థితు వల్ల  అధికారులు గుర్తించిన  350కి పైగా సమస్యాత్మక ప్రాంతాలు, 79 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు సిబ్బంది కనీసం కాలినడకన కూడా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వర్షాకాలం లో వాగులు, వంకలు దాటుకుంటూ అక్కడి చేరుకోవడం వైద్య సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. 

 అప్రమత్తంగా ఉన్నాం..

- డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే సిబ్బంది ద్వారా సమస్యాత్మక గ్రామాల్లో దోమల నుంచి రక్షణ కోసం దోమతెరలను పంపిణీ చేశాం. అవసరమైన మందులను అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం కరోనా నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. సిబ్బందికి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో సీజనల్‌ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం. 

Updated Date - 2022-07-08T04:33:26+05:30 IST