మల్యాడలో కొట్లాట

ABN , First Publish Date - 2022-06-26T05:59:18+05:30 IST

మల్యాడ గ్రామంలో శనివారం దళితులు, బీసీల మధ్య చెలరేగిన ఘర్షణ రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఇరువర్గాలు గ్రామ ప్రధాన కూడలిలో కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇందులో ఆరుగురు దళితులకు, నలుగురు బీసీలకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ నారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మల్యాడలో కొట్లాట
గ్రామంలో ఇరువర్గాలు కొట్లాడుకుంటున్న దృశ్యం


దళితులు, బీసీల మధ్య చెలరేగిన ఘర్షణ
పది మందికి గాయాలు.. పోలీసు పికెట్‌ ఏర్పాటు

నెల్లిమర్ల, జూన్‌ 25:
మల్యాడ గ్రామంలో శనివారం దళితులు, బీసీల మధ్య చెలరేగిన ఘర్షణ రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఇరువర్గాలు గ్రామ ప్రధాన కూడలిలో కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇందులో ఆరుగురు దళితులకు, నలుగురు బీసీలకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ నారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామంలో రెండురోజుల క్రితం బీసీ వర్గానికి చెందిన యువతిని దళిత వర్గానికి చెందిన అబ్బాయి వివాహం చేసుకున్నాడు. ఆ రోజు ఊరేగింపులో డీజే సౌండ్‌ తగ్గించాలని కొందరు కోరారు. దీనికి అంగీకరించపోవడంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అప్పటి నుంచి గ్రామంలో రెండు వర్గాలకు పొసగడం లేదు. తాజాగా శనివారం ఉదయం గ్రామంలో తాగునీటి బోరువద్ద దళిత, బీసీలకు చెందిన మహిళల మధ్య గొడవ జరిగింది. మాటమాట పెరిగాక మిగతా గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇందులో దళితులకు చెందిన కె.సూరప్పడు, ఏ.రాజేష్‌, కె.చిన్నారావు, బి.గణుష్‌, కె.వంశి, ఎం.కూర్మారావుకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే బీసీలకు చెందిన డి.సత్యం, పి.అప్పలరాజు, పి.పాపయ్యమ్మ, హరిబాబుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులందరూ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లిమర్ల ఎస్‌ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పది మంది పోలీసులతో గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయాందోళన స్థానికుల్లో నెలకొంది. దళితులపై దాడులకు దిగిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘం నాయకులు కనిగిరి శ్రీనివాసరావు, టొంపల నరసయ్య, డీవీ రమణ, దన్నాన గోవింద డిమాండ్‌ చేశారు.


ఇరువర్గాలపైనా కేసు
ఇరువర్గాలపై కేసునమోదు చేసామని ఎస్‌ఐ పి.నారాయణరావు తెలిపారు. కోట్లాటలో గాయాలపాలైనవారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని,  గొడవకు దారితీసిన కారణాలపై ఆరాతీసి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామన్నారు.


Updated Date - 2022-06-26T05:59:18+05:30 IST