Advertisement
Advertisement
Abn logo
Advertisement

మేహాద్రిగెడ్డ భద్రమేనా!

చాలాకాలంగా పనిచేయని రెండు గేట్లు

తుఫాన్‌ సమయాల్లో నాలుగు గేట్ల నుంచే నీరు విడుదల

పూడుకుపోయిన కాలువ

ఇటీవల 17 క్యూసెక్కులు విడుదల చేస్తేనే నీట మునిగిన దిగువ ప్రాంతాలు 

బలహీనంగా రక్షణ గట్టు

దెబ్బతిన్న రాతి పేర్లు

చర్యలు చేపట్టకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని నిపుణుల హెచ్చరిక


గోపాలపట్నం, డిసెంబరు 7:

నగర వాసుల దాహార్తి తీర్చే మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీని నిర్మాణం చేపట్టి సుమారు 44 ఏళ్లు గడిచినా నిర్వహణ సక్రమంగా లేక ప్రమాదపు అంచుల్లో ఉంది. ఇటీవల వరదకు కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిన నేపథ్యంలో...అటువంటి పరిస్థితే వస్తే మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ పరిస్థితి ఏమిటనే చర్చ ఇప్పుడు స్థానికంగా జరుగుతోంది.


మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ను 1977లో నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ సక్రమంగా లేదు. రిజర్వాయర్‌ నిర్మించినప్పుడు కట్టపై ఏర్పాటుచేసిన రాతిపేర్పు చాలావరకు దెబ్బతింది. స్పిల్‌వే సమీపంలో ఎంతో బలీయంగా వుండాల్సిన రాతి పేర్పు దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టలేదు. రిజర్వాయర్‌ గట్టుపై పెరిగిన మొక్కలను తొలగించకపోవడంతో ప్రస్తుతం ఇవి పెద్ద చెట్లుగా, తుప్పలుగా మారి గట్లను బలహీనపరుస్తున్నాయి. రక్షణ గట్టు మరికొన్నిచోట్ల శిథిలావస్థకు చేరింది.  వరద గనుక ఎక్కువగా వస్తే కట్టతెగే ప్రమాదం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


పనిచేయని రెండు గేట్లు 

రిజర్వాయర్‌కు అత్యంత కీలకమైనది స్పిల్‌వే. ఇది ఎంత బలంగా వుంటే రిజర్వాయర్‌ అంత భద్రంగా వున్నట్టు లెక్క. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రిజర్వాయర్‌కు 40 అడుగుల పొడవు, 12.6 అడుగుల ఎత్తులో స్పిల్‌వే వద్ద ఆరు గేట్లు ఉన్నాయి. వీటి నుంచి గరిష్ఠంగా 53 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే విధంగా డిజైన్‌ చేశారు. ఇప్పటివరకు గరిష్ఠంగా 32 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడిచిపెట్టారు. కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌కు సంబంధించి 1, 5వ నంబరు గేట్లు చాలాకాలంగా పనిచేయడం లేదు. రెండు నెలల క్రితం సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ సమయంలో కూడా నాలుగు గేట్లు మాత్రమే ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో రిజర్వాయర్‌ అన్ని గేట్లు పనిచేయకపోతే ప్రమాదం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


పూడుకుపోయిన కాలువ

గులాబ్‌ తుఫాన్‌ సమయంలో రిజర్వాయర్‌ నాలుగు గేట్లు ఎత్తి 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే 89వ వార్డు కొత్తపాలెం శివారుతో పాటు షీలానగర్‌ సమీపంలోని జగ్గయ్యపాలెం ప్రాంతాలు నీట మునిగాయి. 1990లో రిజర్వాయర్‌ నుంచి 32 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే అప్పుడు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే రిజర్వాయర్‌ కాలువ పూడుకుపోవడంతో ఇటీవల 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే పొంగి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. భవిష్యత్తులో భారీవర్షాలు కురిసి రిజర్వాయర్‌ నుంచి 20 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద స్థాయిలో వున్న రిజర్వాయర్‌పై జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇంజనీరింగ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిజర్వాయర్‌ కాలువలో పూడికతీసి పునర్నిర్మించడానికి, స్పిల్‌వే గేట్లు మరమ్మతులు చేపట్టడానికి, కట్టపై రాతి పేర్పునకు చర్యలు చేపట్టాలని అంటున్నారు.

రిజర్వాయర్‌ స్పిల్‌వే వద్ద కట్టపైన బలహీనపడిన రాతి పేర్పు(ఫైల్‌ ఫొటో)


Advertisement
Advertisement