జూట్‌ లాకౌట్‌పై నేడు భేటీ

ABN , First Publish Date - 2021-06-23T05:19:47+05:30 IST

నెల్లిమర్ల జూట్‌మిల్లు లాకౌట్‌ సమస్యపై జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో ఈ నెల 23న బుధవారం చర్చలు జరుగనున్నాయి. ఈ భేటీకి జేసీతో పాటు కార్మిక శాఖ తరపున డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ హాజరు కానున్నారు. యాజమాన్యం తరపు నుంచి యజమాని ప్రితీష్‌షరడా, సీఈవో ఎంవీరావు, కమర్షియల్‌ మేనేజర్‌ పంకజ్‌ రాఠీ హాజరు కానున్నట్లు సమాచారం.

జూట్‌ లాకౌట్‌పై నేడు భేటీ
నెల్లిమర్ల జూట్‌మిల్లు

 నెల్లిమర్ల చేరుకున్న యాజమాన్య ప్రతినిధులు

మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు

నెల్లిమర్ల, జూన్‌ 22: నెల్లిమర్ల జూట్‌మిల్లు లాకౌట్‌ సమస్యపై జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో ఈ నెల 23న బుధవారం చర్చలు జరుగనున్నాయి. ఈ భేటీకి జేసీతో పాటు కార్మిక శాఖ తరపున డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ హాజరు కానున్నారు. యాజమాన్యం తరపు నుంచి యజమాని ప్రితీష్‌షరడా, సీఈవో ఎంవీరావు, కమర్షియల్‌ మేనేజర్‌ పంకజ్‌ రాఠీ హాజరు కానున్నట్లు సమాచారం. వీరు ఇప్పటికే కోల్‌కతా నుంచి నెల్లిమర్లకు చేరుకున్నట్లు భోగట్టా. మిల్లు శ్రామిక సంఘం నుంచి అధ్యక్షుడు పతివాడ అప్పారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు చిక్కాల వెంకటగోవిందరావు, ప్రధాన కార్యదర్శి మద్దిల వెంకటరమణ హాజరు కానున్నారు. జూట్‌ మిల్లుకు గత నెల 27న వేకువజామున లాకౌట్‌ ప్రకటిస్తూ యాజమాన్యం నోటీసు అతికించింది. ఈ నిర్ణయాన్ని  ్లశ్రామిక సంఘం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. సీపీఐ, సీపీఎం, ఇఫ్టూ ప్రతినిధులు కూడా నిరసన తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు. ఇదే సమయంలో మిల్లు శ్రామిక సంఘం అధ్యక్షుడు పతివాడ అప్పారావు ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు మంత్రి బొత్స సత్యనారాయణ, ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి బొత్స వెంటనే స్పందించి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లతో మాట్లాడారు. ఉమ్మడి చర్చలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ ఇరువర్గాలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. కార్మికులు ఉద్దేశపూర్వకంగా విధులకు గైర్హాజరవుతున్నారని, చిత్తశుద్ధితో పనిచేయడం లేదని యాజమాన్యం అప్పట్లో లాకౌట్‌ నోటీసులో పేర్కొంది. 105 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల మిల్లులో ప్రస్తుతం కేవలం రోజుకు 25 టన్నుల ఉత్పత్తి మాత్రమే వస్తోందని పేర్కొంది. ఆర్థిక సమస్యలతో మిల్లును మూసివేయాల్సి వచ్చిందని ఆ నోటీసులో స్పష్టంచేసింది. మంత్రుల ఆదేశాలతో బుధవారం జరుగునున్న చర్చల్లో ఏం జరుగుతుందో చూడాలి.


Updated Date - 2021-06-23T05:19:47+05:30 IST