ఉనికి ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2022-06-30T05:48:05+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుతో మీ సేవ కేంద్రాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

ఉనికి ప్రశ్నార్థకం

మీ సేవల నుంచి పలు సర్వీసులు తొలగింపు 

సచివాలయాల రాకతో నిర్వహణ అగమ్యగోచరం 

ఏలూరు రూరల్‌, జూన్‌ 29 : గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుతో మీ సేవ కేంద్రాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేంద్రాల్లో అందించే సేవలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. మొన్న రేషన్‌ కార్డుల సేవలు, నిన్న అడంగల్‌ కరక్షన్‌, నేడు మ్యూటేషన్‌ సేవలను తప్పించారు. దీనిపై నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం అందించే వివిధ ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా 2012లో అప్పటి ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా 636 మీ సేవ కేంద్రాలు ఉండేవి. వీటి ద్వారా 540 రకాల పౌరసేవలు అందేవి. నిర్వాహకులు లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే కొద్దిపాటి కమీషన్‌తో కుటుంబాలను పోషించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. వాటిలో అన్ని సేవలు అందిస్తామని చెబుతూ మీ సేవ కేంద్రాల్లో అందే సేవలను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. ప్రభుత్వ చర్యలను మొదటి నుంచి కేంద్రాల నిర్వాహకులు వ్యతిరేకిస్తున్నారు. 2019 డిసెంబర్‌లో ఆందోళన చేపట్టారు. తమ సేవలను కొనసాగించాలంటూ సంఘ నాయకులు కోర్టును ఆశ్రయించారు. వాటిని యధావిధిగా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత పలు సేవలను తొలగించడంతో మీ సేవ నిర్వాహకులు నిరాశ చెందుతున్నారు. సచివాలయాల్లో ఎన్ని రకాల సర్వీసులు ఉన్నాయో మీ సేవల్లోను అలాగే ఉండాలని అప్పుడు ప్రజలకు ఎలాంటి ఆటంకం ఉండదని నిర్వాహకులు కోరుతున్నారు. 


Updated Date - 2022-06-30T05:48:05+05:30 IST