ప్రతిభకు పాతర

ABN , First Publish Date - 2020-08-08T08:35:53+05:30 IST

కరోనా సమయంలో ఆరు నెలలపాటు తాత్కాలిక ప్రాతిపదికపై భర్తీ చేయనున్న వైద్య సిబ్బం ది పోస్టుల్లో ..

ప్రతిభకు పాతర

పారదర్శకతకు తిలోదకాలు

పైరవీలు, పైసలకే పెద్దపీట

తాత్కాలిక వైద్య సిబ్బంది 

ఎంపికలో ఇష్టారాజ్యం

భారీగా దండుకున్న దళారులు

ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగార్థులు


అనంతపురం వైద్యం, ఆగస్టు 7 : కరోనా సమయంలో ఆరు నెలలపాటు తాత్కాలిక ప్రాతిపదికపై  భర్తీ చేయనున్న వైద్య సిబ్బం ది పోస్టుల్లో అధికారులు ప్రతిభకు పాతరేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రి, వైద్య కళాశాల, జిల్లా సర్వజనాస్పత్రి, కేన్సర్‌ యూనిట్‌లలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ ఆస్పత్రులలో పని చేయడం కోసం అత్యవసరం కింద 1474 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే ఈ భర్తీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 5వ తేదీ వరకూ వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ పేరుతో దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్టాఫ్‌ నర్సులు, అనస్తీషియా టెక్నీషియన్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ఈసీజీ టెక్నీషియన్స్‌, ఫార్మాసిస్టులు, ఎలక్ర్టీషియన్స్‌, ప్లంబర్స్‌, స్వీ పర్స్‌, ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ధోబీ, సెక్యూరిటీ గార్డులు, బయోమెడికల్‌ టెక్నీషియన్స్‌, ఇంజనీర్స్‌, స్టాటీషియన్‌ తదితర పోస్టులు ఉన్నాయి.


వీటికి నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. పైరవీలు, పైసలిచ్చినోళ్లను మాత్రమే ఎంపిక చేసినట్లు నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు. అధికారుల ఎంపిక ప్రక్రియతో పాటు అర్హత అభ్యర్థుల జాబితా ఇందుకు అద్దం పడుతోంది. అభ్యర్థులు ఎంపికైతే వారి చిరునామా, ఊరు, తండ్రి పేరు, క్వాలిఫికేషన్‌, రోస్టర్‌ తదితర వివరాలు జాబితాలో పొందుపరచాల్సి ఉంటుంది. దాదాపు 1000 మందికిపైగా అభ్యర్థులను ఎంపిక చేసి వారి జాబితాను జిల్లా వైద్యకళాశాలలో ప్రదర్శించారు.  కేవలం అభ్యర్థుల పేర్లు మాత్రం రాసి అతికించారు. ఆ అభ్యర్థి పేరు పక్కన ఏ ఊరు, కనీసం తండ్రి పేరు కూడా ప్రదర్శించలేదు. దీంతో ఎంపికైన అభ్యర్థులు ఎవరనేది కూడా తెలియకుండాపోయింది. ఇతర జిల్లాల్లో ఎంపికైన అభ్యర్థుల పేరుతో పాటు చిరునామా, క్వాలిఫికేషన్‌, రోస్టర్‌ మార్కులు ప్రదర్శించారు. ఇక్కడ మాత్రం ఇందుకు విరుద్ధంగా జాబితాను ప్రకటించడం గందరగోళంతో పాటు అనుమానాలకు దారితీసింది. ఈ పోస్టుల్లో ప్రజాప్రతినిధులు సూచించిన వారికే ప్రాధాన్యత ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.


మరోవైపు కొందరు దళారులుగా ఏర్పడి ఒక్కో పోస్టుకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు దండుకున్నారనే  విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఇవి తాత్కాలిక పోస్టులు కాబట్టి పని జరగాలి ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని సూచించారని ఇదే దళా రీలకు కాసుల వర్షం కురిపించిందన్న ఆరోపణలు ఆ శాఖతో పాటు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లోనే వినిపిస్తున్నాయి. మొత్తం మీద తాత్కాలిక వైద్యశాఖ సిబ్బంది ఎంపికలో అధికారులు చేతివాటం ప్రదర్శించి జేబులు నింపుకుని అనర్హులకు పోస్టింగ్‌లు కట్టబెట్టారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ, ధోబీలు, సెక్యూరిటీగార్డులు నియామకాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆ వైద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు. ఎంత మందిని ఎంపిక చేశారని అడిగితే మాత్రం తన దగ్గర పూర్తి సమాచారం లేదని మళ్లీ చెప్తానంటూ తప్పించుకుంటున్నారు. దీన్నిబట్టే ఈ తాత్కాలిక నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న వాదనకు మరింత బలం చేకూరుతోంది. 

Updated Date - 2020-08-08T08:35:53+05:30 IST