మేడం.. బేరం

ABN , First Publish Date - 2022-05-19T06:50:12+05:30 IST

బీసీ రెసిడెన్షియల్‌ (మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆంధ్రప్రదేశ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన ఇనస్టిట్యూట్‌ సొసైటీ) పాఠశాలల్లో ఓ అధికారి రాజ్యమేలుతున్నారు.

మేడం.. బేరం

ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల వరకు..

స్థానిక ప్రజాప్రతినిధికి చేరువై.. దందా

రాష్ట్రస్థాయిలో కొందరు అధికారుల అండ

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మే 18: బీసీ రెసిడెన్షియల్‌ (మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆంధ్రప్రదేశ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన ఇనస్టిట్యూట్‌ సొసైటీ) పాఠశాలల్లో ఓ అధికారి రాజ్యమేలుతున్నారు. డబ్బిస్తే సీట్లను కేటాయిస్తున్నారు. అర్హతలున్న విద్యార్థులకు లాటరీ పద్ధతిలో ఈ పాఠశాలల్లో అడ్మిషన ఇవ్వాలి. కానీ ముడుపులు ఇస్తామని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న వారికి అక్రమమార్గంలో సీట్లను కట్టబెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులిచ్చినవారి కోసం లాటరీ పద్ధతిలో ఎంపికైన విద్యార్థుల్లో కొందరిని సాకులు చూపి వెనక్కు పంపుతున్నారని సమాచారం. సమయం ముగిశాక వచ్చారని కొందరిని వెనక్కు పంపి, ఆ స్థానంలో తన ఖాతాలో ఉన్న విద్యార్థులకు అడ్మిషన ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు రేటు నిర్ణయించి మరీ సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. ఆమె ఏ పాఠశాలకెళ్లినా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులకు వత్తాసు పలికి, వారి పేరు చెప్పుకుని ఒక్కో సీటును రూ.20 వేల నుంచి రూ.30 వేలకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. తాజాగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ మండలంలో బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలను నిర్మించారు. ఆ అధికారిని అక్కడ నియమించారు. ఈ ఏడాది లాటరీ పద్ధతి మొదలుకాకనే ఆమె వ్యాపారం ప్రారంభించారని సమాచారం. 6, 7, 8 తరగతుల సీట్లను పదుల సంఖ్యలో బేరం పెట్టినట్లు సమాచారం. ఆమె తీరుతో అర్హులైన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు.


నిజమేనా..?

బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాల కోసం ఓ ప్రజాప్రతినిధి ఐదు ఎకరాలిచ్చారు. భవన నిర్మాణం కోసం నిధుల విషయంలోనూ సహకరించారు. ఆ కృతజ్ఞతతో రాష్ట్రస్థాయి అధికారులు ఆ ప్రజాప్రతినిధి కోటా కింద 50 శాతం సీట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని ఆమె బహిరంగంగా చెప్పుకుంటున్నారు. 6, 7, 8 తరగతులలో ప్రవేశానికి ఆ కోటా కింద 140 సీట్లను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ 140 సీట్ల మాటున.. దాదాపు 40 సీట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం.  అందుకే.. దరఖాస్తు చేసేందుకు వెళ్లినవారితో ‘సీట్లన్నీ భర్తీ అయ్యాయి’ అని చెబుతున్నారు. ఆమె తీరుపై బాధిత తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


డోంట్‌ కేర్‌

స్థానిక ప్రజాప్రతినిధి మినహా.. ఇతర ఎమ్మెల్యేలు ఎవరు సిఫార్సు చేసినా ఆమె వినుకోవడం లేదని సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు చేస్తేనే సీట్లను కేటాయిస్తామని ఆమె బహిరంగంగా చెబుతున్నారని తెలిసింది. ఆ మండలానికి పొరుగున ఉన్న ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇచ్చిన సిఫార్సు లేఖను ఆమె బుట్టదాఖలు చేశారని అంటున్నారు. ఓ గ్రామీణ విద్యార్థికి 6వ తరగతి ప్రవేశానికి అడ్మిషన ఇవ్వాలని ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇచ్చారని, కానీ స్థానిక ఎమ్మెల్యే నుంచి సిఫార్సు వస్తేనే ప్రాధాన్యం ఇస్తామని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పారని తెలుస్తోంది. ఈ విషయంలో ఆ ప్రజాప్రతినిఽధి నేరుగా ఆమెకు ఫోన చేసినా.. స్పందించలేదని బాధితుల ద్వారా తెలిసింది.


సీనియర్లున్నా..

బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఎంతో మంది సీనియర్‌ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌ ఉన్నారు. వారందరినీ కాదని ఆమెను అందలం ఎక్కించారు. దీని వెనుక ఆ శాఖ రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారుల ప్రమేయం ఉందని సమాచారం. కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయినిగా మొదలైన ఆమె ప్రస్థానం బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను శాసించే స్థానానికి ఎదగడానికి వారే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక ఉద్యోగికి ఒకేసారి రెండు ఉన్నతాధికారి పోస్టులు ఇవ్వడంపట్ల గతంలో వివాదం తలెత్తింది. ఆ సమయంలోనూ అడ్డొచ్చిన వారిలో కొందరిని ముడుపులు, మరికొందరిని బెదిరింపులతో దారికి తెచ్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.


క్యాష్‌ కొట్టు.. సీటు పట్టు..

 పేద విద్యార్థుల కోసం కేటగిరీల వారీగా ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలను నిర్మించాయి. వీటిలో జిల్లాలో పేద విద్యార్థులకు 5 నుంచి 10 వరకూ ఉచిత విద్య, వసతిని అందిస్తున్నారు. 5వ తరగతి ప్రవేశానికి ఆనలైనలో దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఈ తరగతికి మాత్రమే రాష్ట్రస్థాయిలో లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తారు. మిగిలిన వాటికి జిల్లా కలెక్టర్‌ లేదా రాష్ట్రస్థాయి అధికారుల అనుమతి తీసుకుని సీట్లను కేటాయిస్తారు. దీన్ని ఆ అధికారి తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

 కస్తూర్బా పాఠశాలల నుంచి ఆమె ప్రస్థానం మొదలైంది. బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను శాసించే స్థాయికి చేరింది. బీసీ రెసిడెన్షియల్‌లో ఓ సబ్జెక్ట్‌ టీచర్‌గా అడుగు పెట్టిన ఆమె, రకరకాల పైరవీలు, బెదిరింపులతో ఆ పాఠశాలలను శాసిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ ఉండని పాఠశాలను ఎంచుకోవడం, పైరవీలు చేసుకొని చేరిపోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు. అంతకు ముందే.. సంబంధిత నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆశీర్వాదం తీసుకుంటారని, ఆ తరువాతే తన దందాకు కొబ్బరికాయ కొడతారని అంటున్నారు. 

 జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఆ మండలంలోని బీసీ రెనిడెన్షియల్‌ పాఠశాలను తనకు కేటాయించడంతో అక్కడ ఓ మధ్యవర్తిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏడాది 5వ తరగతి లాటరీ పద్ధతి పూర్తీకాకముందే.. 6, 7, 8 తరగతుల అడ్మిషన్ల వ్యాపారం మొదలు పెట్టారు. మధ్యవర్తి ద్వారా 6,7,8 తరగతుల సీట్ల కోసం భారీస్థాయిలో ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. ఒక్కో సీటుకు రూ.30 వేల వరకూ దండుకున్నట్లు  తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు, ఆ పాఠశాలలో దాదాపు 480 సీట్లు ఉంటే.. ఈ ఏడాది 320 సీట్లకు మాత్రమే దరఖాస్తులు ఆహ్వానించారు. అందులో 40 సీట్లు 5వ తరగతికి, లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. 6, 7, 8 తరగతుల సీట్లపై కన్నేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-05-19T06:50:12+05:30 IST