మేయర్‌ వ్యూహం

ABN , First Publish Date - 2021-06-22T05:22:48+05:30 IST

పాలనలో తనకు ఎదురవుతున్న..

మేయర్‌ వ్యూహం

జీవీఎంసీపై పట్టు సాధించే దిశగా ముందుకు...

తన ఆదేశాలు పట్టించుకోని అధికారులపై కీలక నేతకు ఫిర్యాదు

ఈ నేపథ్యంలోనే పలువురి బదిలీ

త్వరలో మరికొందరికి స్థానచలనం

కమిషనర్‌తో విభేదాలు

తాను మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానన్న సదరు నేత హామీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): పాలనలో తనకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకోవాలని మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి భావిస్తున్నారా?,...అందులో భాగంగానే అధికారులు తనను లెక్కచేయడం లేదంటూ ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసే నేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారా?, ఇటీవల జరిగిన అదనపు కమిషనర్లు, జోనల్‌ కమిషనర్ల బదిలీకి అదే కారణమా?’...అనే ప్రశ్నలకు జీవీఎంసీ అధికారులు, వైసీపీ నేతలు అవుననే సమాధానం చెబుతున్నారు.


ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యధిక వార్డులు దక్కించుకోవడంతో మేయర్‌ పదవి 11వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని హరివెంకటకుమారిని లభించింది. ఆమె భర్త శ్రీనివాసరావు వార్డు స్థాయి నాయకుడిగా ఉండేవారు. ఈ నేపథ్యంలో మేయర్‌ అయిన తర్వాత కొంతమంది అధికారులు, పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో గౌరవం ఇవ్వడం లేదనే భావన ఆమెలో మొదలైంది. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జీవీఎంసీ కమిషనర్‌ చాంబర్‌ను తనకు కేటాయించాలని హరివెంకటకుమారి కోరినట్టు తెలిసింది. దీనికి కమిషనర్‌ ససేమిరా అనడంతో ప్రత్యేక అధికారి ఛాంబర్‌తో మేయర్‌ సరిపెట్టుకున్నట్టు సమాచారం. ఇక మేయర్‌గా తాను ఏది చెప్పినా అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదని, అదే కమిషనర్‌ ఆదేశిస్తే మాత్రం ఉరుకులు పరుగులు పెడుతున్నారనే అభిప్రాయంతో హరికుమారి వున్నట్టు ఆమె అనుయాయులు పేర్కొంటున్నారు.


కరోనా సమయంలో మాంసం విక్రయాలను ఆదివారం నిషేధించే విషయంలో మేయర్‌ అభిప్రాయానికి విరుద్ధంగా కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అలాగే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంలో కూడా ఫైనాన్స్‌ విభాగం అధికారులు తన ఆదేశాలను బుట్టదాఖలు చేశారని మేయర్‌ అసంతృప్తితో వున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో మేయర్‌ దంపతులు ఇటీవల నగరానికి వచ్చిన కీలక నేతను కలిసి తమ గోడు చెప్పుకున్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మేయర్‌గా తనకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని, పార్టీ ఆదేశం మేరకే బాధ్యతలు చేపట్టినందున తమరే చొరవ తీసుకుని తమ ఆత్మాభిమానం కాపాడాలని అభ్యర్థించినట్టు చెబుతున్నారు. తాము కింది స్థాయి నుంచి వచ్చిన నాయకులమనే చులకన భావంతో ప్రస్తుత అధికారులంతా వుండడమే సమస్యకు కారణమని మేయర్‌ దంపతులు ఈ సందర్భంగా ఆయన వివరించినట్టు తెలిసింది. ఇప్పుడున్న వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తే ఎలాంటి సమస్య ఉండదని చెప్పినట్టు సమాచారం. దీనిపై స్పందించిన కీలక నేత...తాను కమిషనర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.


అలాగే ‘మీ మాట లెక్కచేయని అధికారుల జాబితాను నాకు అందజేసి, వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా వివరాలు అందించండి’...అని చెప్పినట్టు తెలిసింది. కీలక నేత సూచన మేరకు జీవీఎంసీలో పనిచేస్తున్న ఇద్దరు అదనపు కమిషనర్లు, ఏడుగురు జోనల్‌ కమిషనర్లు, ఒక డిప్యూటీ ప్రాజెక్టు ఆఫీసర్‌ను బదిలీ చే సి, వారి స్థానంలో శ్రీకాకుళం, విజయనగరం, అమరావతిలో పనిచేస్తున్న కొంతమంది పేర్లును సూచిస్తూ జాబితాను మేయర్‌ అందజేసినట్టు తెలిసింది. దీని ప్రకారమే ఇటీవల అదనపు కమిషనర్‌, జోనల్‌ కమిషనర్ల బదిలీల ఉత్తర్వులు జారీ అయినట్టు జీవీఎంసీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మరొక అదనపు కమిషనర్‌, ఇద్దరు జోనల్‌ కమిషనర్లకు కూడా బదిలీ జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఏదిఏమైనా జీవీఎంసీలో తన ముద్ర వుండేలా మేయర్‌ పావులు కదుపుతున్నారనే ప్రచారానికి తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయనే చెప్పుకోవాలి.

Updated Date - 2021-06-22T05:22:48+05:30 IST