చిత్తూరులో మేయర్‌ అభ్యర్థిత్వం మార్పు?

ABN , First Publish Date - 2021-03-05T07:15:54+05:30 IST

చిత్తూరు నగర మేయర్‌ అభ్యర్థిత్వంలో మార్పులు చోటుచేసుకోనున్నాయా అంటే అవునన్న సమాధానమే వస్తోంది అధికార పార్టీ వర్గాల నుంచీ. వైసీపీలో వర్గవిభేదాలు తలెత్తాయని, దాని ఫలితంగా మేయర్‌ అభ్యర్థి విషయంలో తొలి ప్రతిపాదనలు పక్కన పెట్టి సరికొత్త అభ్యర్థులు తెరముందుకు వచ్చారని సమాచారం.

చిత్తూరులో మేయర్‌ అభ్యర్థిత్వం మార్పు?

 ఏకగ్రీవాలు తెచ్చిన తంటా... అధికార పార్టీలో వర్గ విభేదాలు

 చిత్తూరు నగర మేయర్‌ అభ్యర్థిత్వంలో మార్పులు చోటుచేసుకోనున్నాయా అంటే అవునన్న సమాధానమే వస్తోంది అధికార పార్టీ వర్గాల నుంచీ. వైసీపీలో వర్గవిభేదాలు తలెత్తాయని, దాని ఫలితంగా మేయర్‌ అభ్యర్థి విషయంలో తొలి ప్రతిపాదనలు పక్కన పెట్టి సరికొత్త అభ్యర్థులు తెరముందుకు వచ్చారని సమాచారం. ఈ వ్యవహారంలో నేతల పట్టుదలలతో పాటు తెరవెనుక భారీ ఎత్తున ప్రలోభాలు కూడా చోటుచేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మెజారిటీ స్థానాలు ఏకగ్రీవమైన నేపధ్యంలో మేయర్‌ పదవి విసయంలో హఠాత్తుగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  


తిరుపతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):చిత్తూరు నగరంలో 50 డివిజన్లు వుండగా 20వ డివిజన్‌ వైసీపీ అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ మేయర్‌ పదవికి అభ్యర్థిగా తొలినుంచీ ప్రచారంలో వున్నారు. నియోజకవర్గంలో ఓ ముఖ్యనేత ఇతని పేరు ప్రతిపాదించినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారమైంది. గతేడాది మార్చి నుంచీ ఇటీవలి వరకూ ఇదే పేరు వినిపించింది. కానీ మంగళ, బుధవారాల్లో ఉపసంహరణల పర్వం ముగిసేటప్పటికి పరిస్థితి మారింది. 50 డివిజన్లలో 37 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఆ మేరకు కార్పొరేషన్‌ పాలకవర్గం వైసీపీకి దక్కినట్టయింది. అక్కడితో హఠాత్తుగా మేయర్‌ పదవికి 24వ డివిజన్‌ అభ్యర్థి పూమణి పేరు ప్రచారంలోకి వచ్చింది. పార్టీలోని ఓ బలమైన వర్గం ఆ పేరును ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో తొలుత ప్రేమ్‌కుమార్‌ పేరును సిఫారసు చేసినట్టు చెబుతున్న నేత కూడా మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. 30వ డివిజన్‌ అభ్యర్థి సుష్మ పేరును సరికొత్తగా ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. చిత్తూరు నగరంలో వైసీపీకి ఏకగ్రీవాలు సాధించిపెట్టడంలో రెండు వర్గాలు కీలక పాత్ర వహించాయి. ఓ వర్గం కాస్త తక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు సాధించగా మరో వర్గం కాస్త ఎక్కువ సంఖ్యలో చేసిపెట్టాయి. తాము ఎక్కువ మంది కార్పొరేటర్లను ఏకగ్రీవంగా పార్టీకి అందించాం కనుక తాము సూచించిన వారికే మేయర్‌ పదవి కట్టబెట్టాలన్న డిమాండ్‌ వారి నుంచీ గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయమై ఇరువర్గాల నడుమ ప్రస్తుతానికి అంతర్గతంగానే ప్రయత్నాలు సాగుతున్నాయని, పరస్పరం ఎదురెదురుగా కూర్చుని ఇంతవరకూ చర్చించలేదని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై తేల్చుకోవాలని ఎక్కువ సీట్లు ఏకగ్రీవం చేయించిన వర్గం నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెజారిటీ సీట్లు ఏకగ్రీవం చేయించిన సంగతి పక్కనపెడితే మేయర్‌ అభ్యర్థిత్వం మారుతోందన్న ప్రచారం నేపధ్యంలో తెరవెనుక ప్రలోభాలు కూడా మొదలయ్యాయని, ఓ ముఖ్యనేత భారీ నగదు మొత్తాన్ని ఇస్తే పదవి ఇప్పిస్తానంటూ ఓ ఆశావహ అభ్యర్థికి ఆఫర్‌ ఇచ్చినట్టు ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇవన్నీ ఎలా వున్నా మేయర్‌ పదవి ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో అంతిమంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయమే చెల్లుబాటు కానుంది. ఇప్పటి వరకూ సాఫీగా సాగుతున్న చిత్తూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు మేయర్‌ పదవి విషయమై రెండు వర్గాలుగా చీలికకు దారితీసిన నేపధ్యంలో ముందుముందు మరెన్ని పరిణామాలు సంభవిస్తాయోనని అటు రాజకీయవర్గాలు, ఇటు నియోజకవర్గ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Updated Date - 2021-03-05T07:15:54+05:30 IST