గతానికి భిన్నంగా... ఇప్పటికి తగ్గట్టుగా... మాయవతి కీలక ప్రకటనలు

ABN , First Publish Date - 2021-09-07T21:53:45+05:30 IST

బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. తాము గనక అధికారంలోకి వస్తే, విగ్రహాలను

గతానికి భిన్నంగా... ఇప్పటికి తగ్గట్టుగా... మాయవతి కీలక ప్రకటనలు

లక్నో : బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. తాము గనక అధికారంలోకి వస్తే, విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం, స్మారక చిహ్నాలతో  పాటు పార్కుల నిర్మాణాలను చేపట్టమని ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో విగ్రహాలను నెలకొల్పడం, స్మారక చిహ్నాలు, పార్కులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి, మాయావతి విమర్శలను మూటగట్టుకున్నారు. వీటి ద్వారా ప్రజాధనం అధికంగా వృథా అవుతోందని ప్రతిపక్షాలు నానా గగ్గోలు పెట్టాయి. మాయావతి నుంచి అధికారం దూరం కావడానికి ఇది కూడా ఓ కారణమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని మాయావతి తలపోస్తున్నారు. గతంలో చేసిన పొరపాట్లను ఈసారి చేయకుండా, జాగ్రత్త పడాలని చూస్తున్నారు. ఈ జాగ్రత్తలో భాగంగానే తాజా ప్రకటన అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘మన స్ఫూర్తిప్రదాతల విగ్రహాలు, స్మారక భవనాలు, పార్కులు కొత్తవి నిర్మించాల్సిన అవసరమే లేదు. మనం అధికారంలో ఉన్న సమయంలోనే పెద్ద ఎత్తున వాటిని చేపట్టాం’’ అని లక్నోలో జరిగిన ఓ సమావేశంలో మాయావతి పేర్కొన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తాము అధికారాన్ని చేపడితే, వీటిని ముట్టుకోమని, కానీ, యూపీని సర్వసమర్థ రాజ్యంగా మాత్రం తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. 


ఇక... మాయావతి రెండో కీలకమైన ప్రకటన కూడా చేశారు. తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు సామాజికంగా పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ పాలనలో ఉన్నదాని కంటే తమ పాలనలో పెద్ద పీట వేస్తామని ప్రకటించారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’’ అన్న మంత్రంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కేవలం దళితుల సంక్షేమమే కాకుండా బ్రాహ్మణుల సంక్షేమాన్ని కూడా చూస్తామని, తమ పార్టీ అందరిదీ అని మాయావతి ప్రకటించారు. 

Updated Date - 2021-09-07T21:53:45+05:30 IST