5.9 లక్షల ఎకరాలు.. 62.94 టీఎంసీలు

ABN , First Publish Date - 2021-04-13T05:50:51+05:30 IST

జిల్లాలో రెండో పంటకు మే మొదటి వారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.

5.9 లక్షల ఎకరాలు..  62.94 టీఎంసీలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు

మే నుంచి రెండో పంటకు నీరు

తాగునీటి అవసరాలకూ కేటాయింపు

సర్వేపల్లి, డీఆర్‌, డీఎం చానెల్స్‌, ఎన్‌ఎ్‌ఫసీ కింద పంట లేదు!

రైతులు సహకరించాలన్న ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు


నెల్లూరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రెండో పంటకు మే మొదటి వారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టుల కింద రెండో పంటకు 5.9 లక్షల ఎకరాలకు 62.94 టీఎంసీలను కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే చెరువుల్లో నీరు ఉందని, దుక్కులు, నార్లు పోసుకునేందుకు ఇబ్బంది ఉండదని వారు స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ఈ దఫా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించడానికి వీలుపడలేదు. దీంతో అధికారులే నీటి కేటాయింపులపై కలెక్టర్‌ నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను టీజీపీ ఎస్‌ఈ, ఇన్‌చార్జ్‌ సీఈ హరినారాయణరెడ్డి, రెగ్యులర్‌ సర్కిల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ, సోమశిల ఎస్‌ఈ కృష్ణారావు, సెంట్రల్‌ డివిజన్‌ ఈఈ కృష్ణమోహన్‌, వ్యవసాయ శాఖ డీడీ ప్రసాదరావులు సోమవారం నెల్లూరులోని జలవనరుల శాఖ కార్యాలయంలో వెల్లడించారు. సోమశిల కింద 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించినట్లు వారు చెప్పారు. అందుకోసం 9 వేల ఎకరాలకు ఒక టీఎంసీ చొప్పున 42.44 టీఎంసీలను కేటాయించినట్లు ప్రకటించారు. అందులో సంగం డెల్టా కింద 1.50 లక్షల ఎకరాలు, నెల్లూరు డెల్టా కింద 50 వేల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 66 వేల ఎకరాలు, కావలి కాలువ కింద 75 వేల ఎకరాలు, ఉత్తర కాలువ కింద 21వ కిలోమీటర్‌ వరకు మాత్రమే 11120 ఎకరాలు, దక్షిణ కాలువ కింద 32 వేల ఎకరాలకు నీరందిస్తామని పేర్కొన్నారు. ఈదఫా సర్వేపల్లి కాలువ, ఎన్‌ఎ్‌ఫసీ (ఉత్తర కాలువ), డీఆర్‌ - డీఎం చానెల్స్‌కు సంబంధించి అభివృద్ధి పనులు చేస్తుండడంతో ఆ కాలువల కింద ఆయకట్టుకు నీరివ్వడం లేదని అధికారులు తెలిపారు. ఐదు నెలల్లోపు ఈ పనులు పూర్తి చేసి రబీ సీజన్‌కు ఇబ్బంది లేకుండా చూస్తామని వారు స్పష్టం చేశారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. అలానే కండలేరు ప్రాజెక్టు కింద 90,848 ఎకరాల ఆరుతడి ఆయకట్టుకు, 1,14,250 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు 20.50 టీఎంసీల నీటిని కేటాయించామని వెల్లడించారు. కండలేరు కింద రెండో పంటకు  ఈ స్థాయిలో నీరందించడం రికార్డు అని అధికారులు పేర్కొన్నారు. కాగా సాగునీటికే కాకుండా తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు జరిపినట్లు ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు తెలిపారు. 


తాగునీటి అవసరాలకు..

సోమశిలలో తాగునీటి అవసరాలకు 6.9 టీఎంసీలు, కండలేరులో చెన్నైకు 5 టీఎంసీలు, జిల్లాతోపాటు చిత్తూరు జిల్లా తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు, స్వర్ణముఖి బ్యారేజీకు 2 టీఎంసీలుగా కేటాయించినట్లు వెల్లడించారు. అలానే పరిశ్రమల అవసరాలకు కూడా మరో 1.50 టీఎంసీలను కేటాయించినట్లు చెప్పారు. కాగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులు వెంటనే నార్లు పోసుకోవాలని వ్యవసాయ శాఖ డీడీ ప్రసాదరావు సూచించారు. ఎంటీయూ 1010 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, రైతులెవరూ ఆ రకం సాగు చేసి ఇబ్బందులు పడవద్దని కోరారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలు కొరత లేదని పేర్కొన్నారు.  

Updated Date - 2021-04-13T05:50:51+05:30 IST