భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-21T06:01:55+05:30 IST

నియోజకవర్గంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం ఒక్కరోజులోనే 92 పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి.

భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ఒక్కరోజే 92 పాజిటివ్‌ కేసులు నమోదు 

శరవేగంగా విస్తరిస్తున్నా.. కట్టడి చర్యలు శూన్యం 

కందుకూరు, జనవరి 20: నియోజకవర్గంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం ఒక్కరోజులోనే 92 పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. కేవలం ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన పరీక్షల్లోనే ఇంతమందికి కరోనా సోకినట్లు నిర్థారణ కాగా ఇంతకు రెట్టింపు మంది ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకుని చికిత్సలు పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా బయటి ప్రాంతాల వారు అధికంగా రావడం, వేడుకలలో గుంపులుగా కలవడంతో కరోనా వ్యాప్తి చెందిందనే అంచనాలున్నాయి. 15న 19 మందికి, 16న ఏడుగురు, 17న 31మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా 18న 92 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 19న మరో 23 మంది కరోనా బారిన పడ్డట్లు నిర్థారించారు. వీరిలో సగంమందివరకు కందుకూరు పట్టణంలోనే ఉండటం విశేషం. అనుమానితులుగా వచ్చి పరీక్షలు చేయించుకునేవారిలో 70 శాతం వరకు పాజిటివ్‌గానే తేలుతున్నందున ప్రస్తుతం నియోజకవర్గంలో కనీసం నాలుగైదు వందల మంది కరోనా బాధితులు ఉంటారని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలకు వ చ్చేవారిని ఇన్‌ పేషెంట్లుగా జాయిన్‌ చేయటం, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్సలు నిర్వహించడంతో పాటు మెదటి, రెండవవేవ్‌ల సందర్భంగా చేసినట్లే బాధితుల కాంటాక్ట్స్‌ని కూడా క్వారంటైన్‌ చేయటం ద్వారా కరోనా థర్డ్‌ వే వ్‌ని మొగ్గలోనే తుంచేయాలని స్థానికులు కోరుతున్నారు. కేసుల తీవ్రత పెరగడంతో పాటు వైరస్‌ బలం పెరగడం, ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యభావనతో శృతిమించే పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-01-21T06:01:55+05:30 IST