Viral Video: వృద్ధురాలిని కాలితో తన్నిన షాపు యజమాని.. సెలవులకు ఇంటికొస్తూ చూశాడో సైనికుడు.. చివరకు..

ABN , First Publish Date - 2021-08-20T22:36:11+05:30 IST

రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం ముందు ఓ వృద్ధురాలు ఆదమరచి నిద్రపోతోంది. అప్పుడే వచ్చిన ఆ దుకాణం యజమాని ఆ వృద్ధురాలిని పిలిచాడు. ఏయ్.. లే.. అని గట్టిగా అరిచాడు.

Viral Video: వృద్ధురాలిని కాలితో తన్నిన షాపు యజమాని.. సెలవులకు ఇంటికొస్తూ చూశాడో సైనికుడు.. చివరకు..

రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం ముందు ఓ వృద్ధురాలు ఆదమరచి నిద్రపోతోంది. అప్పుడే వచ్చిన ఆ దుకాణం యజమాని ఆ వృద్ధురాలిని పిలిచాడు. ఏయ్.. లే.. అని గట్టిగా అరిచాడు. గాఢ నిద్రలో ఉందేమో.. ఆ వృద్ధురాలు లేవలేదు. దీంతో ఆ షాపు యజమానికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న బాటిల్ లోంచి నీళ్లను ఆమెపై పోశాడు. దిగ్గున ఉలిక్కిపడి లేచిన ఆమె.. క్షమించండయ్యా.. అంటూ ఆ షాపు యజమాని కాళ్లపై పడింది. తన కాళ్లను పట్టుకుని క్షమించమని వేడుకుంటున్నా ఆ యజమాని మనసు కరగలేదు. ఆమెను తిడుతూనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో సెలవుల్లో ఉన్న ఓ సైనికుడు తన సొంతూరికి వెళ్తున్నాడు. తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మహిళతో కలిసి నడుస్తూ ఇంటికెళ్తుండగా ఆ యజమాని నిర్వాకాన్ని చూశాడు. ఆ వృద్ధురాలిని నానా మాటలూ అంటున్నది చూసి తట్టుకోలేక అతడిని నిలదీశాడు. ఆ వృద్ధురాలికి అండగా నిలిచాడు.. ఏంటీ.. ఇదేదో సినిమాలో హృదయాన్ని హత్తుకునే సీన్ అనుకుంటున్నారా..? కాదు.. నిజంగా జరిగింది. ఇప్పుడు ఈ ఘటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఏ ప్రాంతమో.. ఏ రాష్ట్రంలో జరిగిందో తెలియదు కానీ.. నెట్టింట ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. సెలబ్రెటీలు అంతా ఈ వీడియోను షేర్ చేస్తూ భారతీయ సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఆదమరిచి నిద్రపోతున్న ఆ వృద్ధురాలిని నానా మాటలు అంటూ దూషిస్తోంటే.. అప్పుడే వచ్చిన ఓ భారతీయ సైనికుడు ఆ యజమానిపై తిరగబడ్డాడు. వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఇదేం పని అంటూ ఎదురుతిరిగాడు. అతడి కాలర్ పట్టి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ బామ్మ తన కాళ్లపై పడుతోంటే వద్దని వారించాడు. ఆమెకు ఆర్థిక సాయం చేశాడు. ఆమెను అక్కడి నుంచి జాగ్రత్తగా పంపించాడు. ఆగస్టు 11వ తారీఖున ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 2 నిమిషాల 20 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను నెటిజన్లంతా కన్నార్పకుండా చూస్తున్నారు. భారతీయ సైనికుడు చేసిన పనికి సెల్యూట్ చేస్తున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి. 



Updated Date - 2021-08-20T22:36:11+05:30 IST