అంబేద్కర్ ఫొటో వివాదం: లక్షలాది మంది భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2022-02-21T00:59:58+05:30 IST

రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది అంబేద్కర్ వాదులు రాష్ట్ర రాజధాని బెంగళూరు చేరుకున్నారు. అంబేద్కర్ బొమ్మలతో ఉన్న టీ-షర్ట్‌లను ధరించిన నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లక్షలాదిగా కదిలారు. మౌర్య సర్కిల్ నుంచి ప్రారంభమైన వీరి ర్యాలీ..

అంబేద్కర్ ఫొటో వివాదం: లక్షలాది మంది భారీ ర్యాలీ

బెంగళూరు: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై ఒక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ శనివారం లక్షలాది మంది రోడ్డెక్కారు. ఒక చేతిలో నీలి జెండా, మరొక చేతిలో అంబేద్కర్ చిత్ర పటంతో ‘న్యాయం జరగాలి’ అంటూ నినదించారు. వీరి ర్యాలీలో బెంగళూరు నగరం ఒక్కసారిగా నీలిమయమైంది. బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌కు సాగిన ఈ ర్యాలీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కదిలించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్వయంగా నిరసన ప్రదేశానికి చేరుకుని నిరసనకారుల డిమాండ్లకు ఒప్పుకోవడం విశేషం.


రిపబ్లిక్ వేడుకల్లో గాంధీ చిత్రపటం పక్కనే అంబేద్కర్ చిత్రపటం ఉండడాన్ని రాయచూర్ జిల్లా జడ్జి మల్లికార్జున గౌడ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరమే మల్లికార్జునను సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్ కాకుండా ఆయనను పదవి నుంచి పూర్తిగా తొలగించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మల్లికార్జున వ్యాఖ్యలను నిరసిస్తూ కర్ణాటక దళిత సంఘర్ష ఇచ్చిన పిలుపు మేరకు.. ‘సంవిధాన సురక్షణ మహా ఒక్కుట’ అనే పేరుతో ఐక్యంగా సంఘంగా ఏర్పడి ఫిబ్రవరి 19న మహా ర్యాలీ తీయాలని ముందే నిర్ణయించుకున్నారు.


అనుకున్న ప్రకారమే రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది అంబేద్కర్ వాదులు రాష్ట్ర రాజధాని బెంగళూరు చేరుకున్నారు. అంబేద్కర్ బొమ్మలతో ఉన్న టీ-షర్ట్‌లను ధరించిన నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లక్షలాదిగా కదిలారు. మౌర్య సర్కిల్ నుంచి ప్రారంభమైన వీరి ర్యాలీ.. విధాన సౌధ ప్రాంగణంలోని ఫ్రీడం పార్క్‌కు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీతో బెంగళూరు నగరం నీలం రంగులోకి మారిపోయింది. బెంగళూరులోని రోడ్లు, ఫ్లైఓవర్లపై ఈ ర్యాలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


రిపబ్లిక్ డే అనంతరం వచ్చిన విమర్శలపై జడ్జి మల్లికార్జున స్పందిస్తూ ‘‘ప్రభుత్వ ఆదేశానుసారం కొంతమంది న్యాయవాదులు నా వద్దకు వచ్చి మహాత్మాగాంధీ చిత్రపటం పక్కనే అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు హైకోర్టు ముందు ఉందని హైకోర్టు రిజిస్ట్రార్ మా లీడర్స్ గ్రూప్‌లో తెలియజేశారు. కోర్టు ఏ నిర్ణయమో తెలిపే వరకు వేచి ఉండాలని, అలాగేనన్ను బలవంతం చేయవద్దని వారిని అభ్యర్థించాను’’ అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లోనూ అంబేద్కర్ చిత్రపటం ఉండాలని ఈ ఫిబ్రవరి 4న కర్ణాటక హైకోర్టు నిర్ణయించింది. అయితే కోర్టు ఆదేశం ఆచరణలోకి రావడం లేదని, కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని అంబేద్కర్ వాదులు డిమాండ్ చేస్తున్నారు.



Updated Date - 2022-02-21T00:59:58+05:30 IST